కర్ణాటకలో రాసలీలల వీడియోల కేసు పలు మలుపులు తిరుగుతోంది. రాసలీలల వీడియో సీడీ కేసులో బాధిత యువతి సోమవారం సాయంత్రం కోర్టుకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని కోర్టులో స్పష్టం చేసింది. అయితే తమ కుమార్తె కిడ్నాప్ అయినట్లు ఆమె తల్లిదండ్రులు బెంగళూరు ఆర్‌టీ నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా కేసు విచారణ సందర్భంగా సుమారు 100 మంది పోలీసులతో కోర్టు వద్ద బందోబస్తు ఏర్పాటైంది. రాసలీలల కేసును సీబీఐకి ఇవ్వాలని ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను బెంగళూరు హైకోర్టు విచారించి కేసు పురోగతి నివేదికను అందజేయాలని సిట్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. మరోవైపు తమ కుమార్తె చెప్పే మాటలను పరిగణించరాదని ఆమె తండ్రి హైకోర్టులో అర్జీ వేయడం గమనార్హం.
అటు రాసలీలల వీడియో సీడీ కేసులో ఇరుక్కున్న కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆదివారం రాత్రి ఆయనకు టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. ఆయన బెళగావి జిల్లా గోకాక్‌లో ఆస్పత్రిలో ఐసీయూలో చేరారు. మరో నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు.