Saturday, November 23, 2024

కర్నాటక ప్రాజెక్టులపై కోర్టుకు, తెలంగాణ రాష్ట్రం యోచన.. అప్పర్‌ భద్ర, అప్పర్‌ తుంగపై పోరాటం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కృష్ణా నదిపై కర్ణాటక రాష్టం నిర్మించతలపెట్టిన అప్పర్‌ భద్ర, అప్పర్‌ తుంగ ప్రాజెక్టులను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అప్పర్‌ భద్ర ప్రాజెక్టు ద్వారా 10 టీఎంసీల నీటిని, అప్పర్‌ తుంగ ప్రాజెక్టు ద్వారా 20 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు కర్ణాటక రాష్ట్రం ఈ రెండు ప్రాజెక్టులను తలపెట్టింది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణకు ఎగువ నుంచి చుక్క నీరు కూడా రాదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రెండు ప్రాజెక్టులకు బచావత్‌ ట్రిబ్యునల్‌ నుంచి ఎటువంటి నీటి కేటాయింపులు లేకున్నా కర్ణాటక ప్రభుత్వం ముందుకు వెళ్లడం దారుణమని తెలంగాణ నీటిపారుదలశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రిబ్యునళ్లకు, నిబంధనలకు విరుద్దంగా కర్ణాటక రాష్ట్రం వ్యవహరిస్తున్నా… ఆ రాష్ట్ర నిర్ణయాల వైపే కేంద్రం మొగ్గు చూపే అవకాశం ఉండడంతో న్యాయపరమైన మార్గంలో వెళ్లి కర్ణాటకను నిలువరించాలని తెలంగాణ యోచిస్తోంది. ఇందుకు సుప్రీం కోర్టులో కేసు వేయాలని తెలంగాణ సాగునీటిశాఖ భావిస్తోంది. ఇందుకు న్యాయ నిపుణుల అభిప్రాయాలను, సూచనలను సేకరిస్తోంది. అప్పర్‌ భద్ర, అప్పర్‌ తుంగ ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపక్రమించిన కర్ణాటక ఎలాగైనా ఆ ప్రాజెక్టులను నిర్మించి తీరుతుందని ఆ రాష్ట్ర గత చరిత్ర తెలిసినా సీనియర్‌ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరెండు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని ఇప్పటికే కేంద్ర జలశక్తిశాఖకు తెలంగాణ లేఖ రాసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు నిలిపివేయాలని కోరింది.

ఈ రెండు ప్రాజెక్టులు నిర్మాణమైతే తుంగభద్ర నుంచి కృష్ణలోకి నీటి ప్రవాహం బాగా తగ్గుతుందని, ఆ ప్రాజెక్టులు నిర్మాణమైతే తెలంగాణ నీటి ప్రయోజనాలు దారుణంగా దెబ్బతింటాయని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో జలశక్తి శాఖతోపాటు కోర్టులోనూ కర్ణాటకపై పోరాడాలని నిర్ణయించింది. నీటి కేటాయింపులు లేకుండా ఎగువన కర్ణాటకలో ప్రాజెక్టులను నిర్మిస్తే ఆ ప్రభావం దిగువన ఉన్న తెలంగాణ పై ప్రత్యక్షంగా పడుతుందని అధికారులు చెబుతున్నారు. చిన్న,మద్య, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, లి ప్టుల రూపంలో సుమారు 288 టీఎంసీల అదనపు నీటిని కర్ణాటక వాడుకుంటోందని 2003లోనే టీఆర్‌ఎస్‌ పార్టీ సాక్షాధారాలతో సహా కేంద్ర జలసంఘానికి లేఖలు రాసింది. కర్ణాటకలో, కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉండడంతో అప్పర్‌ భద్ర, అప్పర్‌ తుంగ ప్రాజెక్టులకు ఆ రాష్ట్రం సులువుగా అనుమతులు సాధించే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టులో కేసు వేయటం ద్వారా అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు కర్ణాటక ప్రభుత్వాన్ని నిలువరించేందుకు అవకాశాలు చిక్కుతాయని తెలంగాణ అంచనా వేస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement