ప్రభన్యూస్ : వికారాబాద్ జిల్లాలో మొత్తం ఐదు ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 59 మద్యం దుకాణాలు ఉన్నాయి. మూడు ఎక్సైజ్ సర్కిళ్లు కర్ణాటకతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రం నుంచి నిషేధిత గుట్కా.. నిషేధిత గడ్డి మందులను మాత్రమే కొందరు వ్యక్తులు వివిధ మార్గాలలో తీసుకవచ్చి విక్రయిస్తూ వచ్చారు. తాజాగా కర్ణాటక మద్యంను కూడా అక్రమంగా తీసుకవచ్చి విక్రయించడం ప్రారంభించారు. ఈ మొత్తం వ్యాపారం సరిహద్దు గ్రామాలలో అధికంగా నడుస్తోంది. మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తులు.. ప్రస్తుతం మద్యం వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కర్ణాటక మద్యంను తీసుకవచ్చి గ్రామాలలో ఉండే బెల్ట్ దుకాణాలకు పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యాపారం అంతా కూడా వేకువజామున జరుగుతోంది. గ్రామాల్లోని బెల్ట్ దుకాణాలకు మద్యంను తరలించే ఆటోలపై ఎక్సైజ్ శాఖతో పాటు స్థానిక పోలీసు శాఖ పెద్దగా పట్టించుకోవడం లేదు.
రాష్ట్రంలో ఇటీవల మద్యం ధరలను భారీగా పెంచారు. చీప్ లిక్కర్ క్వార్టర్ ధర రూ.120కు పెంచారు. అదే కంపెనీ చీప్ లిక్కర్ ధర కర్ణాటకలో రూ.70 ఉంది. కర్ణాటకలో చీప్ లిక్కర్ ధరలు మన కంటే చాలా తక్కువగా ఉన్నాయి. మన వద్ద చీప్ లిక్కర్ ఫుల్ బాటిల్ ధర రూ.500 ఉండగా కర్ణాకటలో రూ.300 లోపు ఉంది. ఇలా చీప్ లిక్కర్ ధరలలో భారీ వ్యత్యాసం ఉండడంతో కర్ణాటక మద్యంపై కొందరు వ్యక్తులు దృష్టి సారించి వ్యాపారం ప్రారంభించారు. మద్యం వ్యాపారంలో ఉన్న కొందరు వ్యక్తులకు సరిహద్దు ప్రాంతాల్లోని మద్యం దుకాణాల లైసెన్సులు వచ్చాయి. సరిహద్దు ప్రాంతాలలో మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న వ్యాపారులు ప్రతిరోజు ఆటోల ద్వారా మద్యంను గ్రామాలలో ఉండే బెల్ట్ దుకాణాలకు పంపిణీ చేస్తున్నారు. కొందరు వ్యాపారులు ఇక్కడి మద్యంకు బదులుగా కర్ణాటక మద్యంను బెల్ట్ దుకాణాలకు పంపిణీ చేసి భారీగా లాభపడుతున్నారు. సరిహద్దు ప్రాంతాలలో మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న వ్యాపారుల నుంచి ప్రతినెలా ఎక్సైజ్ శాఖతో పాటు పోలీసు శాఖకు మామూళ్లు అందుతున్నాయి. దీంతో మద్యం వ్యాపారుల ఆటోల వైపు వారు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. గ్రామాలలో ఉండే మద్యం బెల్ట్ దుకాణాలలో కర్ణాటక మద్యంను రహస్యంగా నిల్వ చేసి విక్రయిస్తున్నారు. పట్టుబడినా తమ పేర్లను చెప్పవద్దు అని గ్రామాలలో బెల్ట్ దుకాణాలను నిర్వహించే వ్యక్తులకు వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం ఎక్సైజ్ శాఖకు వచ్చే ఆదాయంలో చీప్ లిక్కర్ విక్రయాల ద్వారానే అధికంగా వస్తోంది. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలలో ఉన్న మద్యం దుకాణాలలో విక్రయాలు భారీగా పడిపోయాయి. రెండు నెలల క్రితంతో పోలిస్తే ప్రసుతం మద్యం అమ్మకాలు 30 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఇంత భారీగా మద్యం విక్రయాలు పడిపోయినా జిల్లా ఎక్సైజ్ శాఖ మేల్కొనకపోవడం గమనార్హం. జిల్లాలోని చాలా మద్యం దుకాణాలలో విక్రయాలు పడిపోవడానికి కర్ణాటక నుంచి వస్తున్న చీప్ లిక్కర్ కారణంగా తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.