కర్ణాటకలో కరోనా రెండో వేవ్‌లో భాగంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా నివారణ కోసం ప్రజలకు వ్యాక్సిన్ వేయడానికి సరిపడా నిల్వలు లేవు. దీంతో మరో నాలుగు రోజులు మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తామని అక్కడి వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. మరిన్ని వ్యాక్సిన్లు కోసం కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని అడగ్గా.. కరోనా వ్యాక్సిన్లు చేరవేసేందుకు మరో రెండు వారాలు వేచి చూడాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ అధికారులు చెప్తున్నారు.
కర్ణాటకలో ఇప్పటివరకు 60 ఏళ్లు కలిగిన 11.73 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగా.. 45 ఏళ్ల కలిగిన 3.09 లక్షల మందికి తొలి మోతాదు వ్యాక్సిన్ డోస్‌లు పూర్తి చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి రెండో డోస్ వ్యాక్సిన్ వేయాల్సి ఉందన్నారు. అయితే వ్యాక్సిన్ కొరత ఉన్నందున తొలి డోస్ తీసుకున్న వారు రెండో డోస్ వ్యాక్సిన్ కోసం మరో 6-8 వారాలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సమర్ధత ఎక్కువ ఉన్న కారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లను తాము వేస్తున్నట్లు అధికారులు వివరించారు.