బెంగుళూరు – కర్ణాటకలో కొత్తగా ఏర్పాడిన సిద్ధరామయ్య సర్కార్ తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో 24మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వాస్తవానికి కర్ణాటక ప్రభుత్వంలో 34మంది మంత్రులు ఉండొచ్చు. వీరిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో సహా పదిమంది మే 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. మిగిలిన 24 మంది కొత్త మంత్రులు ఇవాళ ప్రమాణస్వీకారం చేసిన వారి జాబితాలో ఉన్నారు. కొత్త మంత్రులైన ఎమ్మెల్యేల జాబితాలో దినేష్ గుండూరావు, కృష్ణ బైరేగౌడ, ఈశ్వర్ ఖండ్రే, శివరాజ్ తంగడి, ఆర్‌బి.తిమ్మాపూర్, బి.నాగేంద్ర, లక్ష్మీ హెబ్బాల్కర్, మధు బంగారప్ప, డి. సుధాకర్, చెలువరాయ స్వామి, మంకుల్ వైద్య, ఎంసీ, సుధాకర్, రహీం ఖాన్, సంతోష్ లాడ్, కెఎన్.రాజన్న, కె. వెంటకేశ్, హెచ్‌సీ మహదేవప్ప, బైరతి సురేష్ ఉన్నారు.
అయితే, తాజాగా ప్రమాణస్వీకారం చేసిన 24 మందిలో తొమ్మిది మంది తొలిసారిగా ఎన్నికైన వారు.. కాగా అందులో ఒక మహిళ కూడా ఉన్నారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో ఆరుగురు వొక్కలిగలు, ఎనిమిది మంది లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. ముగ్గురు మంత్రులు షెడ్యూల్డ్ కులాలు, ఇద్దరు షెడ్యూల్డ్ తెగలు, ఐదుగురు ఇతర వెనుకబడిన వర్గాల వారికి అవకాశం దక్కింది. క్యాబినెట్‌లో బ్రాహ్మణులకు కూడా ప్రాతినిధ్యం లభించింది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరు ఎమ్మెల్యేలకు సముచిత గౌరవం ఇవ్వడంతో పాటు కుల, ప్రాంతాల వారీగా ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సీఎం సిద్ధరామయ్య మంత్రివర్గ విస్తరణలో సమతూకం పాటించారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.