ముచ్చటైన సంక్రాంతి సంబరంలో చివరి రోజును కనుమ పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడింటి దేనికదే ప్రత్యేకత. ముఖ్యంగా కనుమ పండుగను పశువుల పండుగని చెబుతారు.
రైతన్నల సంతోషానికి మారుపేరైన సంక్రాంతి సంబరంలో పశువుల పాత్ర ఎంతో గొప్పది. రైతులు పొలం దున్ని, విత్తనాలు నాటి, పంట పండించి ఇంటికి చేర్చేవరకూ అడుగడుగునా పశువుల ప్రాధాన్యత ఎక్కువే. కేవలం పంట పండించేందుకే కాదు ఆవులు, ఎనుములు పాడి రైతులకు మరో ఆదాయ వనరుకూడా. .
గ్రామాల్లో పశువులను కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు. అలాంటి వాటికి ఏడాదిలో ఒక్కరోజు అయినా కృతజ్ఞతలు చెప్పడమే కనుమలో ఆంతర్యం.
కనుమ రోజు ఉదయాన్నే పశువులను శుభ్రంగా కడిగి పసుపు, బొట్టు పెట్టి..కాళ్లకు గజ్జెలు కడతారు.మెడలో దండ వేస్తారు. కొమ్ములను కూడా అందంగా అలంకరిస్తారు. రంగు రంగుల కాగితాలు , రిబ్బన్లు కడతారు. తోకను కూడా అందంగా అలంకరిస్తారు.
ఇప్పుడంటే కనుమ సందడి పెద్దగా కనిపించడం లేదు కానీ..ఒకప్పుడు గ్రామాల్లో చాలా నియమాలు పాటించేవారు. ముఖ్యంగా కనుమ రోజు స్వయంగా ఇంటి యజమానులు అడవికి వెళ్లి ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, మారేడు, నల్లేరు, మోదుగ చెట్లపూలు..ఆకులు..కాండం..వేర్లు వీటిని తీసుకొచ్చేవారు.
వీటిని మొత్తం కలిపి పొడి చేసి పశువులకు తినిపించేవారు. ఏడాదంతా అవి ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి జబ్బులు వాటికి ఉన్నా తగ్గిపోవాలని , రోగనిరోధక శక్తి పెరగాలని వాటికోసం రోజంతా సమయం కేటాయించేవారు. ఇప్పుడు ఇవేమీ పాటించడం లేదు కానీ అలంకరించి పూజిస్తున్నారు..రోజంతా వాటికి విశ్రాంతి ఇస్తున్నారు.
పశువుల పండుగరోజు వాటి దేవుడైన కాటమరాయుడిని పూజిస్తారు. ఊరి పొలిమేరల్లో ఉండే ఈ కాటమరాయుడు ఆ గ్రామంలో పశువుల సంతతిని కాపాడుతాడని గ్రామస్తుల, రైతుల నమ్మకం. పశువుల అలంకరణ, పూజ తర్వాత బండ్లు కట్టి కుటుంబంతో కలసి కాటమరాయుడి గుడికి కానీ, ఊరి పొలిమేర్లలో ఉండే ఆలయాలకు కానీ వెళ్లి మొక్కులు చెల్లిస్తారు.
ఆలయాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత పిండి వంటలతో సంక్రాంతికి విందు పెడితే కనుమ మాత్రం మసాలా ఘుమఘుమలతో ముగుస్తుంది..
భోగి రోజు చిన్నారుల తలపై భోగిపళ్లు పోసినట్టే కనుమ రోజు పశువులకు కూడా దిష్టి తీస్తారు. ఇలా చేస్తే వాటి ఆయుష్షు వృద్ధి చెందుతుందని నమ్మకం.
.కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అనే సెంటిమెంట్ చాలామందికి ఉంది. ఈ రోజు పెద్దలకోసం పూజలు, కుటుంబం కోసం విందు భోజనాలు ఏర్పాటు చేయడమే కాదు, కుటుంబం మొత్తం కలసి భోజనం చేయాలని చెబుతారు. ఇంత హడావుడి ఉంటుంది కనుకే ఈ రోజు ప్రయాణాలు చేయకూడదు అనే సెంటిమెంట్ ఉంది.
ఏడాదిలో మూడు రోజుల పాటూ జరుపుకునే సంక్రాంతి వేడుకలో మూడు రోజులూ అందరూ కలిసే ఉండాలని చెబుతారు. అందుకే ఈ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు కానీ..ప్రయాణిస్తే ఏమైనా జరిగిపోతుందనే భయం అవసరం లేదంటారు మరికొందరు