హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : కంటివెలుగు దేశంలోనే ఓ గొప్ప పథకమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కితాబిచ్చారు. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో కంటి వెలుగు కార్యక్రమ శిబిరాన్ని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ క్యాంప్‌లో స్పీకర్ కంటి పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. కంటివెలుగు లక్షలాది కుటుంబాలకు వరమని, ఈ కార్యక్రమంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. మనవద్ద ఫలితాలు చూసి ఇతర రాష్ట్రాలు కంటివెలుగును ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. కళ్లు పోగొట్టుకున్న పేదలు లక్షల్లో ఉన్నారని తెలిపారు. అలాంటి వారికి తమ గ్రామాల్లోనే, పట్టణ వీధుల్లోనే కంటి పరీక్షలు పూర్తి ఉచితంగా అందించడం, కళ్లద్దాలు కూడా ఇవ్వడం.. దేశం హర్షించదగిన కార్యక్రమమన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలని స్పీకర్ కోరారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.