Thursday, November 21, 2024

Big Story | బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో కంటి వెలుగు.. ఇప్పటి వరకు 33,60,301 మందికి నేత్ర పరీక్షలు

కుల వృత్తి దర్జీ పై ఆధారపడి జీవనం గడిపే మేరోళ్ల మురళిది నల్లగొండ పట్టణం సమీపంలోని భాస్కర్ల బావి గ్రామం. కుట్టు పనిపై వచ్చే ఆదాయంతో జీవనం గడిపే మురళికి చూపు సరిగ్గా కనపడేది కాలేదు. దీనితో, చూపు సమస్య ఉండడంవల్ల రోజుకు కేవలం రెండు మూడు గంటలు మాత్రమే పనిచేసేవాడు. అరకొర ఆదాయం ఉండడం చేత కుటుంబ నిర్వహణ కూడా అతి కష్టంగా ఉండేది. సమీపంలోని నల్లగొండ పట్టణానికి వెళ్లి నేత్ర వైద్యుడికి చూపించుకునే స్తొమత కూడా లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించి అమలుచేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం మురళికి ఎడారిలో ఒయాసిస్సులా కనిపించింది. తమ గ్రామంలోనే ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరానికి వెళ్లి పరీక్ష చేసుకోగా ముందుగా 2 .5 పాయింట్ రీడింగ్ గ్లాసులు అక్కడికక్కడే అందచేశారు. ఈ అద్దాలతో తనకు స్పష్టంగా కనిపిస్తోందని, ఈ కంటి వెలుగు అద్దాలతో రోజూ పది గంటలకు పైగా పనిచేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నానని ఆనందంతో చెప్పాడు. ఈ అద్భుతమైన కంటి వెలుగు కార్యక్రమం తనలాంటి ఎంతో మంది నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపిందని, ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న సి.ఎం కేసీఆర్ కు మురళి కృతజ్ఞతలు తెలిపారు.

-ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

కంటి వెలుగు ద్వారా లబ్ది పొందిన సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామానికి చెందిన డి. చంద్రకళ అనే మహిళ మాటల్లో… కండ్లు మసక మసకగా కనిపిస్తుండే. పొలం పని చేసే టప్పుడు కష్టమైతుండే. ఆసుపత్రిలో చూపిద్దామంటే పైసలు లేకపాయే. నా బతుకు గింతే అనుకున్న. కేసిఆర్ సార్ పెట్టిన కంటి వెలుగుతో నా కండ్ల సూపు సక్కగైంది. నాతో పాటు ఎంతో మంది పేదల జీవితాలకు ‘కంటి వెలుగు’ సూపును ప్రసాదించింది. కంటి వెలుగు శిబిరాలలో నాణ్యమైన వైద్య సేవలు అందడంతోపాటు అక్కడికక్కడే కంటి అద్దాలు ఇస్తుండడంతో జోగులాంబ గద్వాల్ జిల్లాలో కంటివెలుగు క్యాంపులకు పెద్ద ఎత్తున గ్రామీణులు హాజరవుతున్నారు. వైద్య పరంగా తీవ్ర నిర్లక్ష్యం చూపిన మారుమూల గ్రామాల వద్దకే అత్యాధునిక పరికరాలతో, అనుభవజ్ఞులైన నేత్ర వైద్యులతోనిర్వహించే కంటివెలుగు క్యాంపులకు పెద్ద ఎత్తున తరలి వచ్చి నేత్ర సంబంధిత వ్యాధులకు తగు వైద్య సలహా తీసుకోవడం, కంటి అద్దాలు పొందడం, అవసరం ఉన్న వారికి రెఫరల్ గ్లాసులు పొందడం జరుగుతోంది.

ఈ విధంగా, రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ కంటివెలుగుకార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాల్లోనూ రికార్డు స్థాయిలో కంటి పరీక్షలు నిర్వహించి ప్రపంచరికారు సాధించగలమని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. గ్రామాలు, మున్సిపల్ వార్డులతోపాటు సచివాలయం, శాశన సభ, డీజీపీ కార్యాలయం, విద్యాసంస్థలు, కార్యాలయాల్లో, భారీ సమూహాలు ఉండే ప్రాంతాల్లోనూ ఈ కంటి వెలుగు శిబిరాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.

- Advertisement -

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 33 లక్షల 60 వేల 301 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమములో మొత్తం నేటి వరకు 6 లక్షల 76 వేల 732 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది .

కంటివెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు ..

  • మొత్తం కంటిప‌రీక్ష‌లు: 33,60,301 మంది
  • మొత్తం రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 6,76,732
  • మొత్తం ప్రిస్కిప్ష‌న్ గ్లాసెస్ కోసం రెఫ‌ర్‌: 4,60,775
  • కంటి స‌మ‌స్య‌లు లేనివారు: 22,22,669 మంది
Advertisement

తాజా వార్తలు

Advertisement