Friday, November 22, 2024

Delhi | కన్నులపండువగా కాశీ తెలుగు సంగమం.. వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి ప్రసంగం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాశీ ఎంత ప్రాచీనమైనదో, తెలుగువారితో ఇక్కడి వారి అనుబంధమూ అంత ప్రత్యేకమైనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. గంగా పుష్కరాల్లో భాగంగా శనివారం సాయంత్రం కాశీ తెలుగు సంగమం వైభవంగా జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో సమ్మేళనం నిర్వహించారు. కాశీ తెలుగు సమితి, గంగా పుష్కరాల నిర్వహణ కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఉన్న బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో వారణాసిలోని మానస సరోవర్ ఘాట్‌లో కాశీ తెలుగు సంగమం ఘనంగా జరిగింది. ఉత్తరాది వారితో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు జీవీఎల్ నరసింహారావు ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం, వేద పండితుల ఆశీర్వచన, స్తోత్ర పారాయణం, గంగా ఆరాధన, గంగా హారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు.

గంగా పుష్కరాలకు తరలివచ్చిన భక్తులకు ముందుగా ఆయన శుభాభినందనలు తెలిపారు. కాశీ విశ్వనాథుడి దర్శనానికి వచ్చిన మీరంతా వారణాసి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నా అతిథులని ప్రధాని అన్నారు. భారతీయ సంస్కృతిలో అతిథులను భగవంతుడితో పోలుస్తారని గుర్తు చేశారు. ఇతర పనుల వల్ల వారణాసి వచ్చి మీ అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోయినా నా మనసులో తలుచుకుంటున్నానని చెప్పారు. కాశీ తెలుగు సంగమాన్ని ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారంటూ ఎంపీ జీవీఎల్‌ను నరేంద్రమోదీ అభినందించారు. పుష్కరాలు గంగా గోదావరి సంగమం వంటివని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, పద్దతుల సమాగమమే ఈ సంగమమని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన కాశీ తమిళ సమాగమంలోనూ తాను పాల్గొన్నానని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రస్తుతం నడుస్తున్న రోజులు అమృత గడియల వంటివన్న ప్రధాని, వచ్చే పాతికేళ్లలో అత్యద్భుత అభివృద్ధి జరగబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు వారు వస్తే తమ కుటుంబ సభ్యులు వచ్చినట్టుగా కాశీవాసులు భావిస్తారని ఆయన స్పష్టం చేశారు.

మిమ్మల్ని స్వాగతించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని భక్తులకు చెప్పారు. కాశీ ఎంత పవిత్రమైనదో, తెలుగు వారితో ఇక్కడి వారి అనుబంధం అంత పవిత్రమైనదని ఆయన కొనియాడారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చి వారణాసిలో స్థిరపడ్డ 16వ శతాబ్దానికి చెందిన తెలుంగు స్వామి గొప్పతనాన్ని ఈ సందర్భంగా నరేంద్రమోదీ గుర్తు చేశారు. శైవక్షేత్రమైన వేములవాడను దక్షిణ కాశీగా అభివర్ణిస్తారని, ఆలయాల్లో దొరికే నల్ల దారాన్ని కాశీ దారం అంటారని, తెలుగు సాహిత్యంలోనూ శ్రీనాథుడి కాశీ ఖండం, కాశీ మజిలీ కథలు… ఇలా వారణాసికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆయన వివరించారు.   ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైల భ్రమరాంబిక, తెలంగాణలో రాజరాజేశ్వరీదేవి ఉన్నట్టే కాశీలో విశాలాక్షి ఉన్నారని వివరించారు. గతంలో భక్తులు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఎంతో కష్టపడి కాశీ వచ్చేవారని, ఇప్పుడు పరిస్థితులు ఎంతో మారాయని నరేంద్రమోదీ అన్నారు.

- Advertisement -

రోడ్లు, జాతీయ రహదారులు ఎంతో అభివృద్ధి జరగడంతో కాశీ యాత్ర ఇప్పుడు ఎంతో సులువుగా మారిందని చెప్పారు. గతంలో రోడ్ల మీదే వైర్లన్నీ వేలాడుతూ ఉండేవని, ఇప్పుడంతా అండర్ గ్రౌండ్ వైరింగ్ చేశారని, గంగానదిలో నడిచే బోట్లన్నీ సీఎన్‌జీవని చెప్పుకొచ్చారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి వారణాసికి రోప్‌వేనూ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి వెల్లడించారు. బెనారస్ పాన్, బెనారస్ చీరలు, ఏటికొప్పాక చెక్కబొమ్మల్లాగే ఇక్కడి కొయ్యబొమ్మలు, లస్సీ ఎంతో ఫేమస్ అని, వాటి గురించి కూడా తెలుసుకుని మీ కాశీ యాత్రను మరింత మధురానుభూతిగా మలుచుకోవాలంటూ ఆయన భక్తులకు సూచించారు. పుష్కరాలు జాతీయ భావాన్ని పెంపొందించుతాయని ఆయన అభిలషించారు.

కాశీ తెలుగు సంగమం గురించి చెప్పగానే ప్రధానమంత్రి ఎంతో ఆసక్తి కనబరిచారని ఎంపీ జీవీఎల్ తెలిపారు. ఓవైపు పుష్కరాల ఏర్పాట్లతో పాటు ఈ సంగమానికి కూడా ఆయన ఎంతో ప్రాధాన్యతనిచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. గంగా పుష్కరాలను నిర్వహించడం తన అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారనని జీవీఎల్ అన్నారు. ప్రధానమంత్రి కోసం సామవేదం షణ్ముఖ శర్మ ప్రత్యేకంగా సంస్కృతంలో రచించిన వేద ఆశీర్వచనాన్ని సభా వేదికపై పలికారు. ఆ ఆశీర్వచన పత్రాన్ని ప్రధానమంత్రికి అందజేయాల్సినదిగా ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన పండితులు, స్వాములు, ప్రముఖులతో పాటు పలువురికి ఈ సందర్భంగా సన్మానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement