న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ కాంగ్రెస్‌లో కమ్మ రాజకీయం నడుస్తోంది. తమ సామాజిక వర్గ నేతలకు సీట్లు కేటాయించాలంటూ కమ్మ సామాజిక వర్గ ఆశావహులు ఢిల్లీ బాట పట్టారు. మాజీ ఎంపీ రేణుక చౌదరి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్య వేదిక నాయకులు న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. రాష్ట్రంలో తమ సామాజిక వర్గం ఓటర్లు 40 నియోజకవర్గాలలో ఫలితాలను ప్రభావితం చేస్తారు కాబట్టి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
బాన్సువాడ, షేర్ లింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, సిర్పూర్ కాగజ్‌నగర్, మేడ్చల్ స్థానాల్లో కమ్మ అభ్యర్థులకు సీట్లు కేటాయించాలని కోరారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కాకుండా మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి స్థానం కల్పించాలని కోరారు. కేసీ వేణుగోపాల్‌ను కలిసిన అనంతరం తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ గోపాలం విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు. తమ ఐక్యవేదిక తరఫున కేసీ వేణుగోపాల్‌ను కలిశామన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తగిన ప్రాతినిథ్యం ఇవ్వాలని కోరామని, తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేశామని చెప్పారు. వేణుగోపాల్ నుంచి సానుకూల స్పందన వ్యక్తమైందని అన్నారు.
సామాజిక న్యాయం ఆధారంగా అందరికీ సముచిత ప్రాధాన్యత ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని, తమకు తగిన ప్రాతినిథ్యం లభిస్తుందని నమ్మకం కలిగిందని విద్యాసాగర్ వెల్లడించారు. గతంలో కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఈసారి తప్పనిసరిగా ఇవ్వాలని లెక్కలతో సహా వివరించామని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చే ప్రాధాన్యతను బట్టి తమ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. తమ వేదికలో అన్ని పార్టీల వారు ఉన్నారని ఆయన తెలిపారు. పది నుంచి 12 స్థానాలు ఇవ్వాలని కోరామన్నారు. 40 నియోజకవర్గాల్లో తమకు బలం ఉందని, తమది బలమైన సామాజిక వర్గమని విద్యాసాగర్ వివరించారు. 30 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగలిగే శక్తి ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం, పాలేరు, కోదాడ, మల్కాజిగిరి, బాన్సువాడ, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గాల సీట్లు కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఖర్గేతో సమావేశం అనంతరం రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడారు. తమ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిథ్యం లేదన్న ఉద్దేశంతో ఆశావహులు ఢిల్లీ వచ్చారని చెప్పుకొచ్చారు. కొందరు విదేశాల నుంచి ఫోన్ చేసి సెలవు పెట్టుకుని వస్తామని చెప్పారన్నారు. అందుకే కమ్మ వేదిక తరఫున తాము వినతిపత్రం అందజేశామన్నారు. ఖర్గే చాలా ఓపికగా తమ ఆవేదన విన్నారని, ఆయనకు అన్ని సామాజిక వర్గాల గురించి లోతైన అవగాహన ఉందని ఆమె తెలిపారు. సామాజిక వర్గాలకు కేవలం ఓటు అధికారం మాత్రమే కాదు, వారికి సీట్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు, సినిమా, మీడియా రంగాల్లో ఉన్న కమ్మ వారికి రాజకీయాల్లో కూడా తగిన ప్రాతినిథ్యం ఉండాలని రేణుక అభిప్రాయపడ్డారు. అనంతరం మాజీ మంత్రి జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కమ్మ ఐక్య వేదికకు సంఘీభావం ప్రకటించారు. వారు కూడా కాంగ్రెస్ గెలుపులో భాగం కావాలని పిలుపునిచ్చారు.
మరోవైపు బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఆశావహులు ఢిల్లీ బాట పట్టారు. బాన్సువాడ స్థానానికి దరఖాస్తు చేసుకున్న 16 మంది ఆశావహులు కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. బాన్సువాడ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న యలమంచిలి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలో మొదటి నుంచి ఉండి క్షేత్ర స్థాయిలో పని చేసిన వారికే టికెట్లు ఇవ్వాలని అధిష్టానాన్ని అభ్యర్థించామని చెప్పారు. బాన్సువాడలో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తున్నవారికి టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 40 ఏళ్లలో ఒకేసారి బాన్సువాడలో కాంగ్రెస్ గెలిచిందని గుర్తు చేశారు. 9 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కాంగ్రెస్‌కు సంబంధం లేదన్నట్టు వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. 2018 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తరువాత ద్వితీయ శ్రేణి నాయకత్వం పార్టీ బాధ్యతను తీసుకుందని ఆయన తెలిపారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లయి ఇవ్వొద్దని అధిష్టానాన్ని కోరుతున్నామన్నారు. గత ఎన్నికల్లో పోచారం శ్రీనివాసరెడ్డి ఓటమే లక్ష్యంగా పని చేశామని వెల్లడించారు. బాన్సువాడలో 9 మండలాల బాధ్యతను తీసుకుని పోచారం ఓటమి కోసం పని చేస్తున్నామని శ్రీనివాస్ అన్నారు.