Thursday, November 7, 2024

కల్యాణం వైభోగమే.. క‌న్నుల‌పండువ‌గా లక్ష్మీ నారసింహుడి కల్యాణం

ప్రభన్యూస్, ప్రతినిధి/యాదాద్రి : అశేష భక్త జన మధ్య.. గోవింద నామ స్మరణతో లక్ష్మీ నరసింహా స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.. స్వామి వారి కల్యాణం తనివితీరా తిలకించిన భక్తులు తన్మయత్నం పొందారు. రాత్రి 10: 18 గంటలకు అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారతో స్వామి వారి కల్యాణం జరిగింది..ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం జరుగుతున్న గుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష్మీనరసింహస్వామి వారి పరిణయోత్సవం కనులపండువగా సాగింది. కొండపైన తూర్పు మాఢ వీధుల్లో ఆగ్నేయంలోని బ్రహ్మోత్సవ మండపంపై కల్యాణ ఘట్టాన్ని రాత్రి ఘనంగా నిర్వహించారు. మొదటగా ప్రధానాలయలో రాత్రి 8.25 గంటలకు గజ వాహన సేవపై స్వామివారు పెళ్లి కొడుకుగా ముస్తాబై మాఢ వీధుల్లో ఊరేగుతూ మండపానికి చేరుకున్నారు.

ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి కల్యాణ వేడుకలను మండపంలో స్వామివారు పడమటి వైపు, తూర్పు వైపు అమ్మవారిని సేవలో అధిష్టింపజేసి వేడుకలు నిర్వహించారు. విశ్వక్సేనుడికి తొలిపూజలతో ప్రారంభమై.. స్వామికి యజ్ఞోపవీతధారణ జరిపి పాదప్రక్షాళన గావించారు. స్వామి, అమ్మవార్లను జీలకర్ర బెల్లంతో అలంకరించి మాంగళ్య పూజ తంతు నిర్వహించారు. బ్రహ్మముహూర్తంలో 10: 18 గంటలకు నారసింహుడు మహాలక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. మాంగళ్యధారణ జరిగిన తర్వాత భక్తులు దర్శించుకునే విధంగా కల్యాణమూర్తులు, కల్యాణ లక్ష్మీనృసింహులను ఉత్తర దిశలో అధిష్టింపజేశారు. ఉదయం స్వామి వారు శ్రీరాముడిగా భక్తులకు దర్శనమిచ్చి, హనుమంత వాహనంలో విహరించారు.

- Advertisement -

పట్టు వస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ రెడ్డి..

స్వామి అమ్మవార్ల కల్యాణానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరు కల్యాణానికి సీఎం కేసీఆర్ సతీమణి శోభతోపాటు కుటుంబ సభ్యులు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మా రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ డిసిపి రాజేష్ చంద్ర ,ఈవో గీతా రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. మరోవైపు స్వామివారు లక్ష్మీదేవిని పరిణయమాడిన ఘట్టాన్ని తిలకించడానికి వచ్చిన అశేష భక్తజనంతో యాదాద్రికొండ కిక్కిరిసింది. సంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సభ్యులతో సహా తరలివచ్చారు. తమ ఇష్టదైవాన్ని ఆరాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement