న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి అధికారినీ వదిలిపెట్టనట్టే కల్వకుంట్ల కుటుంబాన్నీ వదిలిపెట్దదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన మల్లు రవికి ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం తెలంగాణ భవన్‌లో వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడారు. రూ. 16వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ నాయకత్వం పూర్తిగా రాష్ట్రాన్ని దోచుకుని అప్పులపాలు చేసిందని విమర్శించారు.
విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు రాబట్టుకోవడం బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని మధు ఆరోపించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కోచ్ ఫ్యాక్టరీ సహా పసుపు బోర్డు కూడా తీసుకురాలేదని, సెంట్రల్ పూల్‌కు జీఎస్టీ ద్వారా అత్యధికంగా పన్నులు అందజేసిన తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం మొండిచేయి చూపించిందని దుయ్యబట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర బయటపడినా అరెస్టు చేయలేదని, ఢిల్లీకి నాటి బీఆర్ఎస్ సర్కారు కప్పం కట్టడంతో అరెస్టు జరగలేదని విమర్శించారు.
గత ప్రభుత్వంలో కొంతమంది అధికారులు సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కనుసన్నల్లో పని చేశారన్న మధు యాష్కీ… అధికారులు, వారి ద్వారా కల్వకుంట్ల కుటుంబం అవినీతి, అక్రమాలతో తెలంగాణ ఆస్తులను దోచుకున్నారని అన్నారు. అధికారుల దగ్గరే వందల కోట్ల రూపాయలు బయటపడుతున్నాయని, కేసీఆర్ ఫాం హౌజ్ మీద దాడి చేస్తే వందల కోట్లు బయటకి వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మిగతా దేశాల్లో ఇంత అవినీతికి పాల్పడితే ఉరి తీస్తారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయ విచారణ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు గౌరవం ఇచ్చేలా కోదండరాం రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసిందని అన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి బీజేపీ నేతలతో తెర వెనుక ఉన్న అవినీతిని బయటపెట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. కేటీఆర్ తాము ఇంకా అధికారంలో ఉన్నామన్న భావనలోనే ఉన్నారని మధు ఎద్దేవా చేశారు. అవినీతి సొమ్ముతో పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లను కొనాలన్న ప్రయత్నాల్లో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయన్న ఆయన, తాను ప్రచార కమిటీ ఛైర్మన్‌గా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసమే పని చేస్తాను తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి చెప్పినట్టుగా కనీసం 14 సీట్లు గెలిచేలా పని చేస్తామని… తన పాత్ర ప్రభుత్వంలో కాదు, పార్టీలోనే ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలకు డబ్బులు ఎర చూపిస్తున్నారని, సమ్మక్క-సారక్క నెపంతో వరంగల్ వెళ్లిన కవిత వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో మంతనాలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నా తామే తీసుకోవడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరతకు వచ్చిన ఢోకా ఏమీ లేదన్న మధు యాష్కీ, పార్లమెంట్ ఎన్నికల వరకు తెలంగాణ పీసీసీ నాయకత్వంలో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించారు.
ఒక మెట్టు దిగడానికైనా సిద్ధమే!!
నితీశ్ కుమార్ అవకాశవాదానికి బీహార్‌లో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలే ఉదాహరణని అని ఆయన చెప్పారు. విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చింది నితీశ్ కాదన్నారు. నితీశ్ మొదటి నుంచి మోదీ, అమిత్ షా ఆదేశాలపై పని చేస్తున్నారని విమర్శించారు. నితీశ్‌ను నమ్మడానికి వీల్లేదు, ఎన్నికల వేళ ప్లేట్ ఫిరాయిస్తారని ఒకసారి బీజేపీ నేతలే తనతో చెప్పారని మధు గుర్తు చేశారు. నితీష్ విపక్ష కూటమిలో ఉండి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఎన్డీయేకు తిరిగి వెళ్లారని విమర్శించారు. ఇండి కూటమిలో సీట్ల సర్దుబాటు అంశంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, ఒక మెట్టు దిగడానికి కూడా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మమత, కేజ్రీవాల్‌తో నెలకొన్న ఘర్షణ కూడా సెటిల్ అవుతుందని మధు యాష్కీ ఆశాభావం వ్యక్తం చేశారు.