నిరుపేద కుటుంబానికి చెందిన సౌమ్య విలాసాలకు అలవాటు పడింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకుంది. దానికి తగ్గ ప్లాన్ కూడా చేసింది.ఈమె వయసు 28ఏళ్లు. బీకాం చదివని సౌమ్య తండ్రి టీ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, తన చుట్టూ ఉన్న వారి నుంచి ప్రభావితురాలైన సౌమ్య విలాసంగా జీవించాలని కలలు కనేది. ఈ క్రమంలో ఇతరులను మోసం చేసి దర్జాగా ఉండేది. కుమార్తె చేష్టలు తల్లిదండ్రులకు నచ్చేది కాదు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసిన సౌమ్య రామనాథపురంలోని ఓ హాస్టల్‌లో ఉండేది. ఈ క్రమంలో కొంతకాలానికి ఆమెకు రాజేష్ అనే పోలీసుతో పరిచయం అయింది. వారి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో పెళ్లి చేసుకున్నారు. భర్త పోలీసు కావడంతో అతడి పలుకుబడిని ఉపయోగించుకుని మోసాలకు తెరతీసింది. భర్త వద్దనుకున్న డబ్బును కూడా కాజేసింది.
ఆపై అతడిని వదిలించుకుంది. ఆ డబ్బుతో రూ. 7 లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసింది. తనను మోసం చేసిన సౌమ్యపై రాజేష్ కేసు పెట్టడంతో అరెస్ట్ అయి జైలుకెళ్లింది. బెయిలుపై బయటకు వచ్చిన ఆమె మళ్లీ మోసాలకు తెరతీసింది. రామనాథపురానికి చెందిన సతీశ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. కొన్ని నెలల తర్వాత అతడిని కూడా వదిలేసింది. ఇలా ఒకరి తర్వాత ఒకరిగా ఐదుగురిని పెళ్లాడింది. అందరినీ మోసం చేసి వదిలేసింది. అంతేకాదు, రాష్ట్రమంత్రి ఒకరు తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడని చెబుతూ లక్షల రూపాయలు దండుకుంది. చివరిగా ఓ ఆటోడ్రైవర్‌ను పెళ్లాడేందుకు సౌమ్య సిద్ధమైంది. విషయం తెలిసిన బాధితులు ఓ ఇంట్లో ఉన్న ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తమిళనాడులోని కరూర్ పట్టణంలో జరిగింది ఈ సంఘటన.