ఉక్రెయిన్ నుంచి రష్యా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో ఎలాగైనా కీవ్‌ను హస్తగతం చేసుకోవాలనే లక్ష్యంతో.. తమ ఆయుధ భాండాగారంలో ఉన్న ఒక్కో అస్త్రాన్ని రష్యా బయటికి తీస్తున్నది. ఇప్పటికే రెండు సార్లు కింజల్ హైపర్ సోనిక్ క్షిపణితో దాడులకు తెగబడిన పుతిన్ సేన.. తాజాగా మరో శక్తివంతమైన అస్త్రానికి పని చెప్పింది. దీర్ఘ శ్రేణి క్రూజ్ మిసైల్ కాలిబర్‌ను రష్యా మరోసారి ప్రయోగించింది. క్రిమియాలోని సెవస్ట్‌పోల్ వద్ద సముద్రంపై రష్యన్ కార్వెట్టి నుంచి ఈ మిసైల్‌ను ప్రయోగించారు. ఉక్రెయిన్‌లోని ఒర్జెవాలోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దీన్ని ప్రయోగించింది. ఈ ప్రాంతం రాజధాని కీవ్‌కు 200 మైళ్ల దూరంలో ఉంటుంది. కాలిబర్ దాడిలో ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల నుంచి అందిన ఆయుధాలు సైతం ఈ దాడిలో ధ్వంసమైనట్టు రష్యా సైన్యం ప్రకటించింది.
500 కిలోల వార్ హెడ్.
శత్రు దేశాల గగనతల వ్యవస్థలను ఛేదించుకుంటూ.. వెళ్లి భూమిపై ఉన్న లక్ష్యాలను ధంసం చేయడంలో కాలిబర్ క్షిపణికి పెట్టింది పేరు. ఈ క్షిపణులను అత్యంత కీలకమైన లక్ష్యాలపై మాత్రమే రష్యా ప్రయోగిస్తుంది. భూమికి తక్కువ ఎత్తులో ఈ మిసైల్ ప్రయాణిస్తుంది. దాదాపు 500 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలిగే కాలిబర్ క్షిపణి లక్ష్యాన్ని మార్గమధ్యలోనే అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. గోదాములు, కమాండ్ పోస్టులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను ధ్వంసం చేసేందుకు ఈ క్షిపణిని ఉపయోగిస్తారు. కాలిబర్ దీర్ఘ శ్రేణి క్రూజ్ మిసైల్ రష్యా ఉపయోగించడం ఇది రెండోసారి. మార్చి మొదట్లో కూడా మైకలైెవ్ నగరంపై ఈ క్షిపణిని ప్రయోగించింది. ఆ నాటి దాడిలో 8 మంది మృతి చెందారు. కాలిబర్‌ను అభివృద్ధి చేసిన రష్యా.. 2015 అక్టోబర్‌లో తొలిసారి సిరియాపై ప్రయోగించింది. కాస్పియన్ సముద్రం నుంచి 26 కాలిబర్ క్షిపణులు సిరియా ప్రభుతానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రెబల్స్‌పై ప్రయోగించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..