న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతీయ జనతా పార్టీ – తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న వేళ కేంద్ర ప్రభుత్వమిచ్చిన సమాధానం మరో వివాదాన్ని రాజేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఎంపిక చేసేందుకు అవసరమైన ‘అర్హత’ లేదని కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. నల్గొండ ఎంపీ (కాంగ్రెస్) ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బిశ్వేశ్వర్ తుడు ఈ విషయం వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులలో ఆమోదం పొందిన, పొందని వాటి వివరాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయా అంటూ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి తుడు వరుసగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో జాతీయ ప్రాజెక్టుగా ఎంపిక చేయడానికి విధివిధానాలను ఆయన వివరించారు. మొట్టమొదట ప్రాజెక్టును ‘సెంట్రల్ వాటర్ కమిషన్’ అనుమతులు పొందాలని, ఆ తర్వాత అడ్వైజరీ కమిటీ దాన్ని అంగీకరించాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ రెండూ జరిగిన తర్వాత సదరు రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ పొందాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇవన్నీ పూర్తై, జాతీయ ప్రాజెక్టుగా ఎంపిక చేయడానికి పొందుపర్చిన అన్ని నియమాలకు లోబడి ఉంటే.. ఆ తర్వాత హైపవర్డ్ స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. ఒకవేళ హైపవర్డ్ స్టీరింగ్ కమిటీ ఆమోదించి, జాతీయ ప్రాజెక్టుగా ఎంపిక చేసేందుకు సిఫార్సు చేస్తే, కేంద్ర ప్రభుత్వం నిధుల లభ్యతను పరిగణలోకి తీసుకుని జాతీయ ప్రాజెక్టు పథకంలో చేర్చేందుకు ఆమోదం తెలపవచ్చని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు 2016లో ఒకసారి, 2018లో మరోసారి ప్రధాన మంత్రిని కోరారని కేంద్ర మంత్రి తన జవాబులో పేర్కొన్నారు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లోపించిందని, ఫలితంగా ఈ ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు స్కీమ్‌లో చేర్చడానికి అర్హత పొందలేకపోయిందని పేర్కొన్నారు. దీంతోపాటు గోదావరి, కృష్ణ నదుల రివర్ మేనేజ్మెంట్ బోర్డుల ఏర్పాటు, వాటి పరిధిలో ఉన్న ప్రాజెక్టులపై అడిగిన మరికొన్ని ప్రశ్నలకు కూడా కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.
జాతీయ ప్రాజెక్టుగా పథకంలో చేర్చేందుకు ‘అర్హత’ లేదంటూ కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన సమాధానం రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనాలు సృష్టించే అవకాశం ఉంది. నేరుగా జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వబోమని నేరుగా చెప్పకుండా ఆ ప్రాజెక్టు అర్హత పొందలేకపోయిందని పరోక్షమార్గంలో సమాధానం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ పొందగల్గితే, ఇకమీదటైనా దాన్ని జాతీయ ప్రాజెక్టుల పథకంలో చేర్చే అవకాశం ఉంటుందా లేదా అన్న విషయంపై స్పష్టతనివ్వలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.