Friday, November 22, 2024

Delhi | కాళేశ్వరం అవినీతి కళలు.. నీటిపారుదల శాఖ మంత్రి రాజీనామా చేయాలి : డా. కే. లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కళలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, ఎంపీ డా. కే. లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజిపై డ్యామ్ సేఫ్టీ కమిటీ ఇచ్చిన నివేదిక గురించి వెల్లడించారు. నదులకే నడకలు నేర్పిన వ్యక్తి అంటూ సీఎం కేసీఆర్‌ను మంత్రులు కీర్తించారని, కానీ డ్యామ్ సేఫ్టీ నివేదిక చూస్తే పునాది స్థాయి నుంచి తిరిగి నిర్మించాల్సిన పరిస్థితి ఉందని తేలిందని అన్నారు.

- Advertisement -

పటిష్టమైన బ్యారేజి కట్టడంలో వైఫల్యం చెందడం వల్ల తెలంగాణ ప్రజల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని కమిటీ నివేదికలో పేర్కొందని అన్నారు. నిర్మాణంలో, నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం ఉందని ఈ నివేదిక చెబుతోందని అన్నారు. బ్యారేజికి సంబంధించి కమిటీ కోరిన 20 పత్రాల్లో 11 మాత్రమే ఇచ్చి, మిగతావి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం దాగుడు మూతలు ఆడుతోందని అన్నారు. రూ. 35 వేల కోట్ల వ్యయాన్ని  రూ. 1 లక్ష కోట్లకు పెంచారని దుయ్యబట్టారు.

డ్యామ్‌కు ఏమైనా జరిగితే కట్టిన సంస్థే భరిస్తుందని గతంలో చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు మేడిగడ్డ ఒక్కటే కాదు, అన్నారం, సుందిళ్ల బ్యారేజిల విషయంలోనూ ఇదే పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని డ్యామ్ సేఫ్టీ కమిటీ నివేదిక పేర్కొందని డా. లక్ష్మణ్ అన్నారు. ప్లానింగ్, డిజైన్ సహా అన్ని విషయాల్లోనూ లోపాలున్నాయని ఆయన ఆరోపించారు. రీ-డిజైన్ పేరుతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెరపైకి తెచ్చారని, మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టు అవినీతి కళలు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని విమర్శించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement