న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాళేశ్వరం ప్రాజెక్టులో భూమిని కోల్పోయిన తమకు భూమికి బదులుగా భూమి, పరిహారం అందేలా రాష్ట్ర ప్రభుత్వానికి తగు ఆదేశాలు జారీ చేయాలని ముంపు గ్రామాల రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టిన బాధిత రైతులు, గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిశారు. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, చెన్నూరు బీజేపీ ఇంచార్జ్ అందుగుల శ్రీనివాస్ రైతులను కేంద్ర మంత్రి వద్దకు తీసుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కారణంగా 40వేల ఎకరాల్లో పంటపొలాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయని కేంద్ర మంత్రికి వివరించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టు డిజైన్లను అడ్డగోలుగా మార్చేశారని, అందులో భాగంగానే తుమ్మిడి హెట్టి నుంచి మేడగడ్డకు ప్రాజెక్టును తరలిస్తూ… సీఎం కేసీఆర్ రీడిజైన్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ తీసుకున్న ఈ తుగ్లక్ నిర్ణయంతో చెన్నూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు.
భూనిర్వాసితులు, బాధిత రైతులకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి, పరిహారం చెల్లించాలంటూ ఎన్ని ఆందోళనలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరితో రైతుల బృందం సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, ముంపు గ్రామాల పరిస్థితి, నష్టపోతున్న రైతుల వివరాలను మంత్రి సావధానంగా అడిగి తెలుసుకున్నారు. ముంపు గ్రామాల రైతు కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే కాళేశ్వరం బ్యాక్ వాటర్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు. అంతవరకు రైతులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.