న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాదని, అదొక టూరిజం ప్రాజెక్టు అని నల్గొండ ఎంపీ (కాంగ్రెస్) ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులపై టీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు ఎవరికీ ఉపయోగపడలేదని, కొద్దిపాటి వరదలకే ప్రాజెక్టు మునిగిందని దుయ్యబట్టారు. విదేశీ కుట్రల వల్ల వరదలు వచ్చాయంటూ సీఎం కేసీఆర్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖర్చుకు తగ్గ ప్రతిఫలం లేదు కాబట్టే కేంద్రం అనుమతి కోరడం లేదని అన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన కూడా ఇవ్వలేదని ఉత్తమ్ అన్నారు. ఈ కారణంతోనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి అర్హత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని ఆయన గుర్తుచేశారు.
ఈ పరిస్థితుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఎక్కువ వడ్డీలకు ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని, కమీషన్ల కోసం కక్కుర్తిపడి తప్పుడు తప్పుడు డిజైన్లు చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తుమ్మిడిహాట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఉంటే ఎత్తిపోయాల్సిన అవసరం లేకుండా గ్రావిటీతోనే నీటిని తరలించేందుకు వీలు కలిగేదని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు పేరుతో రూ. 1.5 లక్షల కోట్లు వృధా చేశారని ఆరోపించారు. మొత్తంగా కాళేశ్వరం ఒక బోగస్ ప్రాజెక్ట్ అని, దీనిపై చర్యలు తీసుకోకుండా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా డ్రామా ఆడుతోందని అన్నారు. కేవలం 3 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు కోసం రూ. 1.24 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. అసలు కాస్ట్ బెనిఫిట్ రేషియోను కేంద్రం పరిశీలించనేలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై హై లెవెల్ విచారణ జరిపిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దోషులు ఎంత పెద్దవారైనా వదిలి పెట్టబోమని హెచ్చరించారు. అలాగే తాము అధికారంలోకి వచ్చాక తుమ్మిడిహాట్టి వద్ద ప్రాజెక్టు కట్టి గ్రావిటీతో నీరు ప్రవహించేలా చేస్తామన్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునేలా ప్రాజెక్టు నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పూర్తయితే నాగార్జున సాగర్ ఎండిపోతుందంని, 20 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులను నిలిపేసేలా సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకొస్తామని అన్నారు.
రాజగోపాల్‌తో మాట్లాడతా ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేమే గెలుస్తాం..
మరోవైపు టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర రావును ఓడించే రాజకీయ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేస్తానంటూ పార్టీ మారుతున్న సంకేతాలిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో తాను మాట్లాడతానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఎన్నికలు ముందుగానే వచ్చినా ఈ సారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.