న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాకినాడ-వైజాగ్-శ్రీకాకుళం సహజవాయువు పైప్‌లైన్ నిర్మాణం వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తవుతుందని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిస్తూ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ పైప్‌లైన్ నిర్మాణం 2022 జూన్ 30 నాటికి పూర్తి కావలసి ఉందన్నారు. అయితే దీని నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ విజ్ఞప్తి మేరకు పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు నిర్మాణం గడువును 2024 జూన్ 30 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.
కాకినాడ-విశాఖపట్నం-శ్రీకాకుళం సహజవాయువు పైప్‌లైన్ నిర్మాణం, పర్యవేక్షణ కోసం 2014 జూలైలో పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌ను అధీకృత సంస్థగా నియమించిందని మంత్రి తెలిపారు. 2021 జూన్ 30 నాటికి కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు 2022 జూన్ 30 నాటికి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం పూర్తి చేయాలని గడువు విధించిందని మంత్రి తెలిపారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం, వర్షాకాలం కారణంగా పైప్‌లైన్ నిర్మాణ పనుల్లో ఎదురైన ఇబ్బందులు, నిధుల విడుదలలో జరిగిన జాప్యం కారణంగా నిర్మాణ గడువును పొడిగించాలని ఏపీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు పెట్రోలియం బోర్డు గడువును 2024 జూన్ 30 వరకు పొడిగించినట్లు రామేశ్వర్ తెలి వివరించారు.