Tuesday, November 26, 2024

ఫార్మాస్యుటికల్ హబ్‌గా కాకినాడ.. బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధి చేస్తున్నామన్న కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాకినాడకు మంజూరు చేసిన బల్క్ డ్రగ్ పార్క్‌ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు మూడు బల్క్ డ్రగ్ పార్కులను మంజూరు చేశామని కేంద్ర ఫార్మాస్యూటికల్స్ శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంగళవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలో 2000.46 ఎకరాల విస్తీర్ణంలో బల్క్ డ్రగ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని, ఇందుకు అవసరమైన భూమిని ఇప్పటికే సేకరించామని కేంద్రమంత్రి తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్‌ అభివృద్ధి అంచనా వ్యయం రూ.1441 కోట్లని, ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వెయ్యి కోట్లని ఆయన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం స్థిర మూలధన పెట్టుబడి కోసం తీసుకున్న టర్మ్ లోన్‌పై కేంద్రం 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తోందని, పదేళ్ల కాలానికి రాష్ట్రానికి చేరిన నికర ఎస్‌జీఎస్టీలో వంద శాతం తిరిగి కేంద్రం చెల్లించనుందనీ ఆయన చెప్పారు. కాకినాడ ప్రాంతంలో ఫార్మాస్యూటికల్ రంగానికి ఆర్థిక కార్యకలాపాలను రూపొందించడానికి బల్క్ డ్రగ్ పార్క్ ఉపయోగపడనుందని జవాబులో పేర్కొన్నారు. కేంద్రమత్రి సమాధానంపై జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూఈ పార్క్ ఏర్పాటు ద్వారా కాకినాడ దేశంలోనే ఫార్మాస్యుటికల్ హబ్‌గా మారనుందని హర్షం వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement