హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : త్వరలోనే ఆవిష్కృతం కాబోతున్న కాకతీయ టెక్స్టైల్ పార్క్ దేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్క్‌గా రూపుదిద్దుకుంటోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీ రామారావు తెలిపారు. సుమారు 1350 ఎకరాల విస్తీర్ణంలో టెక్స్టైల్ పార్క్‌ను నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కీటెక్స్ యూనిట్లను త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ మంగళవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ”వరంగల్‌కు మళ్లీ పూర్వ వైభవం రానున్నది. ఓరుగల్లుకు తలమానికమైన రీతిలో కాకతీయ టెక్స్టైల్ పార్క్ మళ్లీ జీవం పోసుకుంటోంది.
దేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్క్‌గా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ రూపుదిద్దుకుంటోంది” అని పేర్కొన్నారు. ఆ పార్క్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. రాబోయే కొన్ని నెలల్లోనే కీటెక్స్ యూనిట్లను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని కూడా ట్విట్టర్లోనే వెల్లడించారు. టెక్స్టైల్ ఉత్పత్తి రంగంలో వరంగల్ దేశంలోనే నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకోనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.