ఇండో-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో గొప్ప పురోగతి చోటుచేసుకుంది. బుధవారం సమావేశమైన ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధులు పలు అంశాలపై చర్చించారు. బీజింగ్ వేదికగా జరిగిన ఈ భేటీ ప్రముఖంగా సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతతపై దృష్టిసారించింది.
ఈ సమావేశానికి భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి, సీపీసీ సెంట్రల్ కమిటీ సభ్యుడు వాంగ్‌యి హాజరయ్యారు. తదుపరి రౌండ్ సమావేశాన్ని భారత్‌లో నిర్వహించేందుకు సూచన ప్రాయంగా అంగీకారం కుదిరింది.
సరిహద్దు సంబంధాలపై నిర్మాణాత్మక చర్యలకు అంగీకరించారు. అలాగే మానసరోవర్ యాత్ర కొనసాగింపుపైనా చర్చించారు. కైలాశ్-మానసరోవర్ యాత్ర 2020 కొవిడ్ సమయం నుంచి నిలిచిపోయింది. ఆ తర్వాత గాల్వాన్ ఘర్షణలు.. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక, సరిహద్దు వివాదాల ప్రతిష్ఠంభనల కారణంగా ఈయాత్ర పునరుద్ధరణకు నోచుకోలేదు.
దీనిపై భారత ప్రభుత్వం కొంతకాలంగా చైనా అధికార యంత్రాంగంతో చర్చిస్తూ వస్తోంది. టిబెట్ పీటభూమిలోని కైలాశ్ – మానసరోవర్ యాత్ర సవాళ్లతో కూడుకున్నది. సరిహద్దు వివాదం పరిష్కారానికి న్యాయమైన, సహేతుకమైన, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారానికి ఒక ఫ్రేమ్‌వర్క్ రూపొందించాలని ఇరుదేశాల ప్రతినిధులు నిర్ణయించారు.
ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సవాళ్లపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సరిహద్దు వాణిజ్యంపై డేటా భాగస్వామ్యం సహా ప్రపంచ శాంతికోసం స్నేహపూర్వక సంబంధాల ప్రాముఖ్యతను గుర్తించారు.