Friday, November 22, 2024

Delhi | ‘గుర్తు’ కేటాయించండి మొర్రో.. కేంద్ర ఎన్నికల సంఘానికి కేఏ పాల్ వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్నికల గుర్తు కేటాయించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గురువారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేసిన ఆయన, అక్కడే బయట మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ నెలలోనే తాను అన్ని పత్రాలు సమర్పించానని, కానీ ఎన్నికల గుర్తు కేటాయించకుండా అధికారులు తనను వేధిస్తున్నారని ఆరోపించారు.

పార్టీ క్రియాశీలంగా ఉన్నప్పటికీ.. లేదు అని చెబుతున్నారని వాపోయారు. ఎన్నికల్లో ఇప్పటి వరకు పోటీయే చేయని వైఎస్సార్టీపీకి కూడా గుర్తు కేటాయించారని, కానీ తనకు మాత్రం సింబల్ ఇవ్వడం లేదని అన్నారు. సింబల్ కోసం నిరాహారదీక్ష చేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

హెలీకాప్టర్, రింగ్ గుర్తుల్లో ఏదో ఒకటి కేటాయించాలని కోరానని, ఏది కేటాయించారో కూడా చెప్పడం లేదని ఆరోపించారు. గత 6 నెలలుగా ఇస్తున్నామని చెబుతూ తీరా నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ముగియవచ్చినా గుర్తు కేటాయించకుండా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఎన్నికల సంఘాన్ని అధికారులు నడుపుతున్నారో, కేసీఆర్ నడుపుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. చట్టాలు మారాలంటే తనలాంటి వాడు ఎంపీ కావాలని అన్నారు.

ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల గుర్తు ఎందుకు ఇవ్వడం లేదో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు సమయం కేటాయించాలన్న ఉద్దేశంతోనే పోటీకి దూరంగా ఉన్నానని తెలిపారు. గొర్రెలు కసాయి వారిని నమ్మినట్లే ప్రజలు అవినీతిపరులను ఎన్నుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement