Friday, November 22, 2024

ఎన్ హెచ్చార్సీ చైర్మన్ గా జస్టిస్ అరుణ్ మిశ్రా నియామకం..

ఎన్ హెచ్చార్సీ నూతన చైర్మన్ గా జస్టిస్ అరుణ్ మిశ్రా నియమితులయ్యారు. ఐదుగురు సభ్యుల హైలెవల్ కమిటీ అరుణ్ మిశ్రా పేరు ఖరారు చేసింది. ఈ హైలెవల్ కమిటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమత్రి అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ లు ఇతర సభ్యులు. కాగా, ఎన్ హెచ్చార్సీ చైర్మన్ గా అరుణ్ మిశ్రా నియామకమేమీ ఏకగ్రీవంగా జరగలేదు. హైలెవల్ కమిటీలో ఒకరైన రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఎన్ హెచ్చార్సీ చైర్మన్ గా దళిత, ఆదివాసీ, మైనారిటీ వర్గాల సభ్యుల్లో ఒకరిని ఎంపిక చేయాలని పట్టుబట్టారు. కానీ, కమిటీలో అత్యధికులు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా వైపే మొగ్గుచూపారు. దాంతో ఖర్గే ఈ నియామకంతో ఏకీభవించక, నిరసన నోట్ నమోదు చేసినట్టు తెలుస్తోంది.

జస్టిస్ అరుణ్ మిశ్రా 6 సంవత్సరాలు సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించారు. 2020లో ఆయన పదవీవిరమణ చేశారు. ఆయన తండ్రి హరగోవింద్ మిశ్రా గతంలో న్యాయమూర్తిగా పనిచేశారు. న్యాయమూర్తుల కుటుంబం నుంచి వచ్చిన అరుణ్ మిశ్రా కలకత్తా, రాజస్థాన్ హైకోర్టులకు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement