ప్రభ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం హైదరాబాద్ నగరంలో ఎక్కడా కానరావడం లేదు. 120మైక్రోన్ల మందం కలిగిన ప్లాస్టిక్‌ను నిషేదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసి నెలరోజులు గడుస్తున్నా అమలు మాత్రం కావడంలేదు. మురికివాడల నుంచి మొదలుకుని గేటెడ్ కమ్యూనీటీల వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ క్యారి బ్యాగులు నగరంలో దర్శనమిస్తున్నాయి. కిరాణ దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, టిఫిన్ సెంటర్లు, చికెన్, మటన్‌షాపుల నుంచి మొదలుకుని పెద్దపెద్ద షాపింగ్‌మాల్స్ వరకు అంతటా నిషేదిత ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారు. విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్ వల్ల నగరం చెత్త కుప్పను తలపిస్తోంది. మురికి కాలువలు, చెరువులు, కుంటలు, జలాశయాలు, రోడ్లు, పార్కులు ఒకటేంటి నగరం మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతోంది. మురికి కాలువలు, ఇతర డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరడం వల్ల వర్షం నీరు పోటెత్తినప్పుడు మురుగు నీరు రోడ్లపైకి చేరుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వల్ల పశువులు, మేకలు లాంటి జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ఇన్ని అనర్థాలకు కారణమైన ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయం నగరంలో కనిపించడం లేదు. గతంలో సర్కార్ ఇదేవిధంగా ప్లాస్టిక్ నిషేధంపై హడావిడీ చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకుండాపోయిందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధిత శాఖలు అమ్మకాలపై కఠిన చర్యలకు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పట్టించుకోని జీహెచ్ఎంసీ ..
జులై 1నుంచి 120మైక్రోన్ల మందం కలిగిన ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్టు కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2021ఆగస్టు 12న నోటిఫికెషన్ విడుదల చేసింది. నిషేధం అమలుకు కావాల్సిన కార్యచరణను 8నెలల్లో రూపొందించుకోవాలని అన్నిరాష్ట్రాలను ఆదేశించింది. కేంద్ర ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి నెలరోజులు గడుస్తున్నా ఎక్కడా అమలు కావడం లేదు. హైదరాబాద్ నగరంలో ప్లాస్టిక్ నిషేధం అమలును బుజాల కెత్తుకోవాల్సిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తుండగా, కిందిస్థాయి సిబ్బంది అమ్మకం దార్లతో కుమ్మక్కయ్యారనే విమర్శులు వినిపిస్తున్నాయి. కేవలం మామూళ్లు వసూళ్లు చేసుకోవడం కోసమే జీహెచ్ఎంసీకి చెందిన శానిటరీ ఇన్స్పెక్టర్లు అడపాదడపా దాడులుచేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాటేధాన్ తదితర పారిశ్రామిక వాడల్లో యథేచ్ఛగా ఉత్పత్తి చేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది.
నిషేధించిన ప్లాస్టిక్ వస్తువులు ..
వెలూన్లు వాడే ప్లాస్టిక్స్టిక్స్, ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ జెండాలు, ఐస్ క్రీంపుల్లలు, అలంకరణకు వాడే థర్మాకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్‌లు, స్పూన్లు, కత్తులు, వేడి పదార్థాలు, స్వీట్ బాక్స్‌లకు వాడే పల్చటి ప్లాస్టిక్ ఆహ్వాన పత్రాలు, సిగరేట్ ప్యాకెట్లు, వంద మైక్రాన్లలోపుఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు, క్యాండి స్టిక్స్ మొద లగు సింగిల్ యూజ్ వస్తువులను నిషేధించారు.
అమలుపై సందేహాలు ..
నగరంలో ప్లాస్టిక్ నిషేధం అమలు అనేక సందేహాల కు తావిస్తోంది. నిషేధం విధిస్తూ నెలరోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఎలాంటి కార్యచరణను ప్రకటించలేదు. గతంలో కూడా మున్సిపల్, పోలీస్, పొల్యూషన్ తదితర విభాగాలకు చెందిన అధికారులు నాలుగు రోజులు హడావిడి చేశారు. ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన తయారైంది. ప్లాస్టిక్ వినయోగం నగర ప్రజల జీవనంలో భాగంగా మారిపోయిన నేపథ్యంలో నిషేధం అంతసులువు కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు చట్టాన్ని కఠినంగా అమలు చేస్తేనే నగరంలో ప్లాస్టిక్ నిషేధం సాధ్యమని నిపుణులు అంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.