Tuesday, November 26, 2024

Delhi | కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి కృష్ణారావు, విశ్రాంత పోలీస్ ఆఫీస‌ర్‌ నాగరాజు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అవినీతి బీజేపీ ప్రభుత్వాన్ని కర్ణాటకలో గద్దె దింపినట్టే అంతకు వంద రెట్ల అవినీతికి పాల్పడిన కేసీఆర్ సర్కారును తెలంగాణలో కాంగ్రెస్ గద్దె దించుతుందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో పార్టీలో చేరిన జూపల్లి, అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనివార్య కారణాలతో జూపల్లి కాంగ్రెస్‌లో చేరాల్సిన కార్యక్రమం వాయిదా పడుతూ రాగా ఎట్టకేలకు గురువారం ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయింది. జూపల్లి కృష్ణారావుతో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్ రెడ్డి, వనపర్తి నేత మేఘా రెడ్డి, విశ్రాంత పోలీస్ అధికారి కేఆర్. నాగరాజు సహా జిల్లాకు చెందిన మరికొందరు నేతలున్నారు.

ఉదయం గం. 9.00 నుంచే నేతలు ఒక్కొక్కరుగా ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, సంపత్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు హాజరయ్యారు. జూపల్లి చేరిక అనంతరం తొలుత రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తాను, తన కుటుంబం తప్ప ఇంకేమీ అవసరం లేదని అన్నారు. ఈ వైఖరితో విసిగిపోయి నేతలు బయటకు వస్తున్నారని, బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ నుంచి కూడా నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని వెల్లడించారు. ఆ రెండు పార్టీల్లో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం మచ్చుకైనా లేవని, నేతలు ఇమడలేకపోతున్నారని విమర్శించారు.

చార్లెస్ శోభరాజ్ శిష్యుడు కేసీఆర్
జూపల్లి చేరిక సందర్భంగా మీడియాతో మాట్లాడిన తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చార్లెస్ శోభరాజ్ శిష్యుడిగా అభివర్ణించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి – మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడని, రేవంత్ రెడ్డి – చంద్రబాబు నాయుడు శిష్యుడు అని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు బదులిస్తూ.. తాను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నందున చంద్రబాబు శిష్యుడు అంటున్నారని, కానీ దోపిడీ దొంగ చార్లెస్ శోభరాజ్‌కు కేసీఆర్ శిష్యుడు అని మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకున్న గజ దొంగ అంటూ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిగా 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం కాకుండా తన నలుగురు కుటుంబ సభ్యుల కోసమే పనిచేశారని, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ. 7 లక్షల కోట్ల అప్పులపాలు చేసి దివాళా రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు.

- Advertisement -

తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఎన్నో హామీలిచ్చి ప్రజలను మోసగించారని, ఇప్పుడు ఎన్నికల వేళ మళ్లీ మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ అంశాన్ని తాము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంతో తాజా నిర్ణయం తీసుకున్నారని, అలాగే ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణమే రూ. 2 లక్షల మేర రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పడంతో కేసీఆర్ ఇప్పుడు రుణమాఫీ అంటున్నారని విమర్శించారు. మాట ఇచ్చి తప్పడంలో పేరుగాంచిన కేసీఆర్ ఈ హామీ నెరవేరుస్తాడన్న నమ్మకం తనకు, రాష్ట్ర ప్రజలకు లేదని వ్యాఖ్యానించారు. ఎలాగూ గద్దె దిగడం ఖాయమని, దింపుడు కళ్లెం ఆశతోనే ఇవన్నీ చేస్తున్నారని రేవంత్ అన్నారు. మొత్తంగా కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగల కాంగ్రెస్‌ పాలన రావాలని కోరుకుంటున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రజాభిప్రాయాన్ని గమనిస్తున్న ఇతర పార్టీల్లోని నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. తాజా చేరికలు ఆషామాషీ చేరికలు కాదని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ పునరేకీకరణలో భాగమేనని అన్నారు.

రాష్ట్రంలో ఎమ్మెల్యేల సిఫార్సులతో పోలీసులు, ఇతర విభాగాల అధికారుల బదిలీలు జరుగుతున్నాయని, పదవీ విరమణ పొందినప్పటికీ ప్రభాకర్ రావు వంటి కొందరు అధికారులను కేసీఆర్ ఇంకా కొనసాగిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. రిటైరైన తర్వాత కూడా కొనసాగిస్తూ తన ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్‌పై రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ జాబితాను తాము కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేస్తామని, వారందరినీ తొలగించే వరకు పోరాడతామని చెప్పారు. కేసీఆర్‌ను గద్దె దించడం బీజేపీతో కాదని, బీజేపీ-బీఆర్ఎస్ మిలాఖాత్ రాజకీయాలు జనం గ్రహించారని రేవంత్ అన్నారు. బీజేపీ చెప్పినోళ్లకు కేసీఆర్ రాష్ట్ర పోలీసులతో భద్రత కల్పించడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ లిక్కర్ కింగ్‌లా మారి దోచుకుంటున్నారని, అందుకే అడ్వాన్స్ టెండర్లు పిలిచారని రేవంత్ ఆరోపించారు.

కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా రుణం తీర్చుకోవాలి
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఇబ్బందులు వస్తాయని, పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసి కూడా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కర్ణాటకలో అవినీతి బీజేపీ సర్కారును ఓడించిన మాదిరిగా.. అంతకు మించి అవినీతిలో కూరుకుపోయి కేసీఆర్ సర్కారును కూడా ఓడించాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలన చూస్తే చాలా బాధ కలుగుతోందని, వందలాది మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రమేనా ఇది అనిపిస్తోందని జూపల్లి అన్నారు.

కేసీఆర్ వంటి దుర్మార్గ, అవినీతి, అహంకారపూరిత మనస్తత్వం కల్గిన వ్యక్తం ప్రపంచంలో ఎక్కడా లేడని దుయ్యబట్టారు. తెలంగాణలో చోటుచేసుకున్నంత అవినీతి బహుశా ప్రపంచంలో మరెక్కడా జరిగి ఉండదని అన్నారు. ఉద్యమ సమయంలో ఒక లక్ష రూపాయాలు సర్దుబాటు చేయడానికి తంటాలు పడ్డ వ్యక్తి ఇప్పుడు వేల కోట్లు ఎన్నికల్లో ఎలా ఖర్చు పెడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. అలాగే తొమ్మిదేళ్లలో ఒక్క రోజు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎక్కడైనా ఉన్నారా అని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement