Monday, November 25, 2024

TG | ఎస్సీ వర్గీకరణ అమలుకు జ్యుడీషియల్‌ కమిషన్‌

ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్రంలో ఎలా అమలు చేయాలన్నదానిపై సింగిల్‌ జ్యూడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్‌ నియామకంలో అడ్వకేట్‌ జనరల్‌ సూచనలను పరిగణనలోకి తీసుకోవా లని సూచించింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కేబినెట్‌ సబ్‌ కమిటీ మంగళవారం సచివాలయంలో భేటీ ఆయింది.

మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్‌, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప సంఘం సభ్యులు దామోదర రాజనరసింహ, డి.శ్రీధర్‌ బాబు, దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శనరెడ్డి, బీసీ కమిషన్‌ చైర్మన్‌ జి నిరంజన్‌ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పంజాబ్‌, తమిళనాడు రాష్ట్రాలలో వర్గీకరణపై అధ్యయనం చేసిన అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ల వర్గీకరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఇతర రాష్ట్రాలలో ఎలా అమలవుతున్నదో సబ్‌ కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకై సింగిల్‌ జడ్జ్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేలా నియామకం జరిగేలా చూడాలని సబ్‌ కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారమే వర్గీకరణ జరగాలనే అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు తెలంగాణా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దామోదర్‌ రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు,లోకసభ సభ్యులు మల్లు రవి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన విషయం విదితమే.ఈ క్రమంలో ఈ సమావేశం జరిగింది. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన వర్గీకరణపై నాలుగోసారి మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement