వ్యూహం సినిమా విడుదలపై నేడు వాదనలు ముగిసాయి. తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. హైకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే.. తెలంగాణలో అయినా విడుదలకు అనుమతి ఇవ్వాలని ఆర్జీవీ తరపు న్యాయవాది కోరారు. తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆర్జీవీ న్యాయవాది వాదనపై నారా లోకేష్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వ్యూహం సినిమాకు రేపు ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.
ఇది ఇలా ఉంటే వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ (ఆర్జీవీ) డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ‘వ్యూహం’. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వివాదాస్పదమైంది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని, విడుదలకు అనుమతి ఇవ్వకూడదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు-పవన్ ఏ మాత్రం ఇష్టం లేదని ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆర్జీవీ అన్నారని.. వ్యూహం సినిమాలో తమను కించపరిచేలా తెరకెక్కించారని లోకేష్ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై గతకొన్నిరోజులుగా హైకోర్టులో వాదనలు సాగాయి..చివరికి రేపు తుది తీర్పు వెలువడనుంది.