Tuesday, November 5, 2024

Judgement – అన్ని రాష్ట్ర ప్రభుత్వాల‌కు సుప్రీం కోర్టు షాక్

ప్ర‌జా ప్ర‌యోజ‌నం అంటూ ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు
తొమ్మిది మంది స‌భ్యుల ధ‌ర్మాసనం సంచ‌ల‌న తీర్పు
7 – 2 మెజార్టీత‌తో తీర్పు ఇచ్చిన చీఫ్ జస్టీస్ చంద్ర‌చూడ్
ప్ర‌తి ప్రైవేటు ఆస్తి క‌మ్యూనిటీ ఆస్తి కాదు

న్యూ ఢిల్లీ – ప్రైవేటు ఆస్తుల స్వాధీనం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న అన్ని ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలులేదని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. 7:2మెజారిటీతో సుప్రీంకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌తో పాటు మరో ఆరుగురు న్యాయమూర్తులు ఒకటి.. జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ సుధాన్షు ధూలియా వేర్వేరుగా మూడు తీర్పును రాశారు.

- Advertisement -

సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ రాజేశ్ బిండాల్, జస్టిస్ ఎస్సీ శర్మ, జస్టిస్ ఏజీ మనీష్‌ రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరిపి తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 39(బి) ప్రకారం ప్రతి ప్రైవేటు ఆస్తిని కమ్యూనిటీ ఆస్తిలో భాగంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

చట్టాలు, విధానాల రూపకల్పనలో రాజ్యాంగం నిర్దేశించిన మార్గదర్శకాలను ప్రభుత్వాలు పాటించాలని ఈ ఆర్టికల్‌ చెబుతుందని.. ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తులు ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవచ్చని.. కానీ, ఒక వ్యక్తికి చెందిన ప్రతి వనరునూ ఉమ్మడి ప్రయోజనంగా పరిగణించబడదని, అది భౌతిక అవసరాలకు తగినదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

దాంతో సుప్రీంకోర్టు 1978 నాటి ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4:3 మెజారిటీతో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వం అన్ని ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చని అప్పుడు పేర్కొంది. ప్రత్యేక ఆర్థిక, సామ్యవాద భావజాలం స్ఫూర్తితో ప్రభుత్వం ప్రైవేట్‌ ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చని ఏడుగురు న్యాయమూర్తుల మెజారిటీ నిర్ణయం పేర్కొంది.

అయితే ఆ తీర్పుపై తొమ్మిది మంది స‌భ్యుల ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపి ఆ తీర్పును కొట్టి వేసింది. తాజా తీర్పుతో ప్రైవేట్ యాజమాన్యాల యాజమాన్యంలోని అన్ని వనరులను ఇకపై ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు వీలుండదు.

సుప్రీంకోర్టు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. బెంచ్ నిర్ణయాన్ని జస్టిస్ బివి నాగరత్న పాక్షికంగా విభేదించగా.. జస్టిస్ సుధాన్షు ధులియా పూర్తిగా విభేదించారు. రాజ్యాంగం ప్రకారం, ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని వనరులను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వాలకు లేదని 7:2 మెజారిటీ నిర్ణయంలో సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే, కొన్ని కేసుల్లో ప్రభుత్వాలు ప్రైవేట్ ఆస్తులను క్లెయిమ్ చేసుకోవచ్చని సీజేఐ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement