Saturday, November 23, 2024

Judgement day – మ‌హారాష్ట్ర పీఠం బిజెపి కూట‌మిదే…. కాంగ్రెస్ కూట‌మికి ఘోర ఓట‌మి

ముంబై – మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఏకంగా 216 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. బీజేపీ సింగిల్ గానే వంద స్థానాలకు పైగా స్థానాల‌లో అధీక్యంలో ఉంది… 288 స్థానాలున్న మ‌హారాష్ట్ర‌లో 145 స్థానాల‌లో విజ‌యం సాధించిన వారికి అధికారం ల‌భిస్తుంది. ఈ మ్యాజిక్ ఫిగ‌ర్ ను మహాయుతి దాటేసింది… దీంతో మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే ఏర్పడనుందని తేలిపోయింది. కాంగ్రెస్ ఎంవిఎ కూట‌మి కేవలం 59 స్థానాల‌లో మాత్ర‌మే లీడ్ లో ఉంది..

ఇక కొలాబా స్థానంలో బీజేపీ అభ్యర్థి రాహుల్‌ నర్వేకర్‌, బారామతిలో అజిత్‌ పవార్‌, వర్లిలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కోప్రిలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండే ఆధిక్యంలో ఉండగా, వాండ్రే ఈస్ట్‌లో బాబా సిద్దిఖీ కుమారుడు జిశాన్‌ సిద్దిఖీ (ఎన్‌సీపీ), ఇస్లాంపూర్‌లో ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థి జయంత్‌ పాటిల్‌, ఔరంగాబాద్‌ ఈస్ట్‌లో ఎంఐఎం అభ్యర్థి ఇంజియాజ్‌ జలీల్‌ లీడ్‌లో ఉన్నారు.

ఇక కూటమిలో ముఖ్యమంత్రి సీటు కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (షిండే వర్గం) చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ (అజిత్ వర్గం) చీఫ్ అజిత్ పవార్ లతో పాటు పలువురు ఇతర కీలక నేతలు కుర్చీ కోసం అంతర్గతంగా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆయా పార్టీల్లో కిందిస్థాయి నేతలు తమ నేతే కాబోయే సీఎం అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అజిత్ పవార్ పార్టీ నేతలైతే ఓ అడుగు ముందుకు వేసి మహారాష్ట్ర సీఎం అజిత్ పవార్ అంటూ పోస్టర్లు కూడా పలు సిటీల్లో అతికించారు. దీనిపై బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శుక్రవారం స్పందిస్తూ.. ఫలితాలు వెలువడ్డాక కూటమి నేతలంతా కూర్చుని ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని వివరణ ఇచ్చారు. కాగా, శనివారం వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ సహా ఎన్డీయే కూటమికి చెందిన కీలక నేతలంతా లీడ్ లో కొనసాగుతున్నారు. బారామతిలో పవార్ కుటుంబ పోటీలో అజిత్ ముందున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement