తల్లి ఆస్తిని, తండ్రి పిఎఫ్ ను తీసుకున్న కుమార్తె
కోవిడ్ సమయంలో తల్లిని ఇంటి నుంచి గెంటివేత
న్యాయం కోసం కోర్టు మెట్లెక్కిన తల్లి
నెలకు రూ. మూడు వేలు భరణం చెల్లించాల్సిందేనని తీర్పు
తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కోరే కుమార్తెకు కన్నతల్లి ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుందని మధ్యప్రదేశ్లోని ఇండోర్ కోర్టు స్పష్టం చేసింది. వయోధికురాలైన మాతృమూర్తికి జీవన వ్యయం కింద భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
వివరాలలోకి వెళితే 78 ఏళ్ల తల్లికి 55 ఏళ్ల కూతురు ఏకైక సంతానం. కొవిడ్ విజృంభణ సమయంలో ఇంటి నుంచి కూమార్తె తరిమివేయడంతో ఆ వృద్ధురాలు కోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్గా పనిచేసిన పిటిషనర్ భర్త 2001లో మరణించడంతో ఆ తర్వాత తల్లిని తన ఇంట్లో ఉండాల్సిందిగా కుమార్తె ఆహ్వానించి వారసత్వ ఆస్తి అయిన ఇంటిని విక్రయించేలా చేసింది. తండ్రి పీఎఫ్ ఖాతాలోని డబ్బునూ తీసుకుంది. 2020 మార్చిలో కొవిడ్ వల్ల ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినప్పుడు తల్లిని ఇంట్లో నుంచి తరిమేయడంతో తల్లి కోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన అదనపు ప్రిన్సిపల్ జడ్జి మాయా విశ్వలాల్ కుమార్తె చీరల దుకాణం నడుపుతూ నెలకు రూ.22,000 వరకు ఆదాయం ఆర్జిస్తోందని తనకు తల్లిని పోషించగల స్తోమత కుమార్తెకు ఉందని కోర్టు .. వృద్ధురాలికి నెలకు రూ.3,000 చొప్పున భరణం చెల్లించాలని కుమార్తెను ఆదేశించింది.