Saturday, November 23, 2024

Followup: జూబ్లీహిల్స్ ప‌బ్ రేప్ కేసు.. అస‌లు ఆ పార్టీ ఇచ్చింది ఇంట‌ర్ స్టూడెంట్స్ కోస‌మేన‌ట‌!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ రేప్‌ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. దీనిలో భాగంగా అసలు ఈ పబ్‌లో పార్టీని ఎవరు నిర్వహించారనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అయితే కార్పొరేట్ స్కూల్ ఫేర్‌వెల్ పార్టీ కోసమే ఈ పబ్‌ను బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. 150 మంది స్టూడెంట్స్‌ కోసం ఈ ప‌బ్ బుక్ చేసినట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. నిషాన్, అయాన్, ఆదిత్య అనే వ్యక్తులు పార్టీ కోసం బుక్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం వారు రూ.2 లక్షలు కూడా చెల్లించినట్టు సమాచారం. వీరంతా ఇంట‌ర్ సెకండియ‌ర్ స్టూడెంట్స్ అని తెలుస్తోంది. మరోవైపు పబ్‌లో ఫేర్‌వెల్ పార్టీ నిర్వహణపై విద్యార్ధుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇక‌.. అత్యాచారం కేసులో అయిదుగురు నిందితులను ఇవ్వాల (శ‌నివారం) సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వారికి కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు వారిని జైలుకు తరలించారు. వీరిలో ఇద్దరు మేజర్లతో పాటు ముగ్గురు మైనర్లున్నారు. మరోవైపు నిందితుల వినియోగించిన ఇన్నోవా ఆచూకీ లభ్యం కావడంతో క్లూస్ టీం నిపుణులతో ఆధారాలు సేక‌రిస్తోంది.

ఇకపోతే.. ఈ కేసుకు సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్డిని బీజేపీ నేతలు కలిశారు. బాలికపై అత్యాచారం కేసును సీబీఐకి బదిలీ చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సామూహిక అత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీనిపై ఇప్ప‌టికే హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. హైదరాబాద్ హజ్ హౌస్‌లో ఏర్పాటుచేసిన హజ్ యాత్రికుల వాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ.. అత్యాచార ఘటన ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు హోం మంత్రి. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని, అయితే.. పోలీసులపై వత్తిడి ఉందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement