హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమ్నేషియా పబ్ మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోలీసులు విచారణ పూర్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసేందుకు జూబ్లిdహిల్స్ పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో నేరాంగీర పత్రం (ఛార్జ్‌షీట్) దాఖలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మైనర్ అత్యాచారం కేసుకు సంబంధించి నేరాన్ని నిరూపించేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలను సేకరించినట్లు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి జూబ్లిహిల్స్ పోలీసులు 400 పేజీల ఛార్జ్‌షీట్‌ను సిద్ధం చేశారని సమాచారం.
ఈ కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లేబరీటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదిక, సీసీ ఫుటేజీలు, మొబైల్ డేటా, కాల్ సీడీఆర్‌లు కీలకం కానున్నాయి. పూర్తి ఆధారాలతో పోలీసులు ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయనున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మే 28వ తేదీన జూబ్లిహిల్స్ అమ్నేషియా బార్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా మూడు రోజుల అనంతరం బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సాదుద్దీన్ మాలిక్ సహా నలుగురు మైనర్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
కేసు నమోదు చేసిన రెండు నెలల్లోపే విచారణ పూర్తి చేసిన పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సంసిద్ధమయ్యారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాకు అన్ని వివరాలు వెల్లడించారు. ఈ ఘటన మార్చి 28వ తేదీన మొదలైందని బెంగళూరులో ఉంటున్న ఓ విద్యార్థి వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పున:ప్రారంభించడానికి ముందే విందు చేసుకోవాలని భావించి ఈ సమాచారం అందించినట్టు ఆనంద్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా తన ముగ్గురు స్నేహితులను సంప్రదించాడని పార్టీ జరుపుకునేందుకు ఏ పబ్ బాగుంటుందని ఆయన స్నేహితులను అడిగి తెలుసుకున్న సంగతి విదితమే.
ఈ క్రమంలోనే జూబ్లిహిల్స్ లోని అమ్నేషియా పబ్‌ను ఎంపిక చేసుకున్నారని విందు నిర్వహించుకునేందుకు సిద్ధమై ఈ సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారని ఆనంద్ తెలిపారు. నాన్ ఆల్కాహాల్, నాన్ స్మోకింగ్ పార్టీ పేరుతో పబ్‌ను బుక్ చేసి ఒక్కొక్కరి నుంచి రూ.1200 చొప్పున టికెట్‌ను నిర్వాహికులకు ఒప్పించి రూ.900లకు తగ్గించారని పేర్కొన్నారు. మే 28న పార్టీకి సంబంధించిన వివరాలను మరోసారి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారని అయితే టికెట్ ధర రూ.900 అన్న విషయాన్ని గోప్యంగా ఉంచి ఒక్కొక్కరి నుంచి రూ.1200 వసూలు చేసిన విషయం బయటపడింది.
మే 25వ తేదీన మైనర్ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి పబ్ నిర్వాహికులకు రూ.లక్షను అడ్వాన్స్‌గా చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన స్నేహితుల ద్వారా బాధిత యువతి టికెట్ కొనుగోలు చేసిందని పోలీసులు పేర్కొన్నారు. కేసులో నిందితులను రిమాండ్‌లోకి తీసుకుని విచారించిన పోలీసులు వాస్తవాలను రాబట్టారు. జూబ్లిహిల్స్ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తే ఈ కేసుకు సంబంధించిన విచారణ మొదలవుతుంది.