Friday, November 22, 2024

అదానీ అంశంపై జేపీసీ వేయాల్సిందే.. బీఆర్ఎస్ ఎంపీల ధర్నా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అదానీ – హిండెన్‌బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణకు పట్టబుడుతూ ప్రతిపక్షాలు గురువారం కూడా ఆందోళన కొనసాగించాయి. విపక్షాలతో కలిసి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని మహాత్మ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ని రక్షించాలి, జేపీసీ ఏర్పాటు చేయాలి వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు. తక్షణమే జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించి, కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఉభయ సభలను బహిష్కరించిన అనంతరం బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, లోక్ సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు నాయకత్వంలో పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు ఎంపీలనుద్దేశించి మాట్లాడుతూ అదానీ వ్యవహారంపై జేపీసీ దర్యాప్తు చేపట్టి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఆరు రోజులుగా బీఆర్ఎస్ ఎంపీలు దేశ ప్రజలకు సంబంధించిన కీలక అంశంపై చర్చ జరపాలని కోరుతున్నప్పటికీ కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కోట్లాది మందికి సంబంధించిన కీలక  అంశంపై చర్చ జరపాలని, విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాలని కోరుతూ నిరసన తెలియజేస్తున్నా కేంద్రానికి పట్టడం లేదన్నారు. కేంద్రం ఎందుకు భయపడి, వెనక్కిపోతుందో అర్ధంకావడం లేదని నామా నాగేశ్వర రావు అన్నారు. ఏ తప్పూ లేనప్పుడు చర్చ జరపడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

ఇప్పటికైనా కేంద్రం స్పందించి, పార్లమెంట్ ఉభయ సభల్లో అదానీ అంశాన్ని చర్చించి, ప్రజల్లోని అనుమానాలను నివృత్తి చేయాలని అన్నారు. ఎంతో మంది పేదలు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఎల్ఐసీతో పాటు బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో తమ పిల్లల చదువులు కోసం, పెళ్ళిళ్లు, ఇతర అవసరానికి దాచుకున్నారని, ఇప్పుడీ సంక్షోభం కారణంగా వారంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. వాస్తవాలు దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement