Friday, September 20, 2024

JPC – వ‌క్ఫ్ బోర్డు జెపిసిలో విప‌క్షాల‌కూ చోటు..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలకు’ చెక్ పెట్టేందుకు కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లును కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించాయి. ఈ బిల్లు రాజ్యంగ వ్యతిరేకమని, మైనారిటీల హక్కుల్ని ఉల్లంఘిస్తుందని ఆరోపించింది. విపక్షాల ఆరోపణల నేపథ్యం కేంద్రం ఈ బిల్లును సమగ్రంగా చర్చించేందుకు ”జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)”కి పంపనున్నట్లు వెల్లడించింది.

ఈమేరకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ప్రభుత్వం జేపీనిని ఏర్పాటు చేసింది. జేపీసీ కోసం అధికార, ప్రతిపక్షాలకు చెందిన 21 మంది ఎంపీల పేర్లను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రతిపాదించారు. ఈ కమిటీలో బీజేపీకి చెందిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో పాటు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చోటు దక్కింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌తో పాటు ఎంపీలు ఇమ్రాన్ మసూద్, టిడిపి ఎంపి కృష్ణ దేవరాయులు, మహ్మద్ జావేద్, కళ్యాణ్ బెనర్జీ, జగదాంబికా పాల్, నిషికాంత్ దూబే, తేజస్వి సూర్య, దిలీప్ సైకియా, ఎ రాజా, దిలేశ్వర్ కమైత్, అరవింద్ సావంత్, నరేష్ మాస్కే, అరుణ్ భారతి, అపరాజిత సారంగి, సంజయ్ జైస్వాల్, అభిజిత్ గంగోపాధ్యాయ, మౌలానా మొహిబుల్లా నద్వీ, సురేష్ గోపీనాథ్‌ సభ్యులుగా ఉన్నారు. జేపీసీ కోసం మరో 10 రాజ్యసభ సభ్యుల పేర్లను సిఫారసు చేయాలని రాజ్యసభను కూడా కోరారు.

- Advertisement -

కేంద్రం రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలను కట్టడి చేయడంతో పాటు వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, సర్వే, ఆక్రమణల తొలగింపుకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడం ఈ చట్టం యొక్క లక్ష్యం. 1995 వక్ఫ్ చట్టంలోని 44 సెక్షన్‌ని సవరించాలని చట్టం ప్రతిపాదించింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళలు తప్పనిసరిగా ఉండాలని బిల్లు ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు మరియు అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని కూడా నిర్దేశించింది. మహిళల వారసత్వ సంపదకు రక్షణ కల్పించాలన్నది మరో కీలక ప్రతిపాదన. వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చాలనే నిబంధన ప్రతిపాదిత చట్టంలోని మరో వివాదాస్పద అంశం కూడా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement