తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు లైంగిక వేధింపుల కేసు నుంచి ఎట్టకేలకు విముక్తి లభించింది. అత్యాచారం, లైంగికదాడి ఆరోపణల కేసులో తరుణ్ తేజ్‌పాల్ ను గోవా కోర్టు నిర్దోషిగా తేల్చింది. నెల 19నే ఈ కేసుపై తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే రెండు, మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో తీర్పును జడ్జి వాయిదా వేశారు.
2013లో గోవాలో తెహల్కా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తరుణ్ తనపై అత్యాచారం చేశారని ఆయనతో కలిసి పనిచేసిన ఓ మహిళా జర్నలిస్టు ఆరోపణలు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు తరుణ్ తేజ్ పాల్ పై కేసు నమోదు చేసిన గోవా పోలీసులు.. 2013 నవంబర్ 30న ఆయనను అరెస్ట్ చేశారు. గోవా కోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది. అయితే, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలను కొట్టివేయాలని తేజ్ పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాంతో 2014 జూలై 1 సుప్రీంకోర్టు తేజ్ పాల్ కు బెయల్ మంజూరు చేసింది. అయితే, లైంగిక వేధింపుల ఆరోపణలు కొట్టివేయాలన్న పిటిషన్ ను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. దాంతో గోవా కోర్టులో కేసు విచారణ ఆలస్యమైంది. అయితే 2019లో తనపై ఆరోపణలను రద్దు చేయాలన్న తరుణ్ తేజ్‌పాల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో మళ్లీ గోవా కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఇవాళ తీర్పును వెల్లడించింది.