Sunday, November 17, 2024

కల్తీమద్యంపై ప్రశ్నించిన జర్నలిస్టు.. గ్రూపుగా కలిసి చితకబాదిన పోలీసులు

బిహార్​ పోలీసులు ఓ జర్నలిస్టును కొట్టిన ఘటన ఇప్పుడు సీరియస్​ అయ్యింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వ్యక్తి వార్తను కవర్ చేయడానికి వెళ్లిన స్థానిక జర్నలిస్టుపై అకారణంగా దాడి చేశారు.  బిహార్‌లోని సరన్ జిల్లా గర్ఖా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు బృందం ఈ ఘటనకు పాల్పడింది. నిన్న (గురువారం) గర్ఖా పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీతాజ్‌పూర్ పంచాయతీలోని ఔదామల్ గ్రామంలో కల్తీ మద్యం తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మద్యం సేవించడమే అతని మృతికి కారణమని మృతుడి బంధువులు చెబుతున్నారు. మృతుడు కర్ముల్లా కుమారుడు అల్లావుద్దీన్ ఖాన్ (35)గా గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే గర్ఖా పోలీస్ స్టేషన్, మర్హౌరా పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు.

అంతకుముందు గర్ఖా పోలీస్ స్టేషన్ ఇన్​చార్జి తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, ఫేస్‌బుక్ / యూట్యూబ్‌లో వార్తలను పోస్టు చేసే స్థానిక జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలను లేవనెత్తిన స్థానిక జర్నలిస్టు అనుప్‌కు పోలీసు బృందం సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వెంటనే పోలీసు బృందం ఆ ప్రశ్నలు అడిగిన విలేకరిని తీవ్రంగా కొట్టారు. అతని మైక్ లాగేసి విసిరికొట్టి, అతని ఐడీ కార్డుని కాళ్లతో తొక్కి పగలగొట్టారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్​ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ విచ్చలవిడిగా దొరుకుతుండడంపై జర్నలిస్టు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసులు, ఈ ఘటన బయటకు రాకుండా ఉండడానికే అతడిని కొట్టారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement