ప్లేయర్ ఆఫ్ ది మంత్ నవంబర్ 2022 అవార్డులను ఐసీసీ సోమవారం ప్రకటించింది. మెన్స్ విభాగంలో ఇంగ్లండ్ వన్డే, టీ 20 జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ఈ అవార్డును అందుకున్నాడు. ఈ అవార్డు కోసం సహచరుడు ఆదిల్ రషీద్, పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిదిల నుంచి పోటీ ఎదుర్కొన్న జోస్ అత్యధిక శాతం ఓటింగ్‌తో ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన టీ 20 వరల్డ్‌కప్ -2022లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఇంగ్లండ్‌ను జగజ్జేతగా నిలిపాడు బట్లర్. తనకు ఈ అవార్డు రావడంపై బట్లర్ స్పందించాడు. తనకు ఓటు వేసి గెలిపించిన వారందరికీ అతను ధన్యవాదాలు తెలిపాడు. మరో వైపు ప్లేయర్ ఆఫ్ ది మంత్ మహిళల విభాగంలో పాకిస్థాన్‌కు చెందిన ఓపెనింగ్ బ్యాటర్ సిద్రా అమీన్ ఎంపికైంది. విమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచిన రెండో పాక్ క్రికెటర్‌గా అమీన్ గుర్తింపు సాధించింది. పాక్ ఆల్ రౌండర్ నిదాదార్ అక్టోబర్ నెలలో ఈ అవార్డును అందుకుంది.
కాగా ఈ అవార్డుకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా పాకిస్థాన్ ఆటగాళ్లు ఎంపిక కావడం విశేషం. సెప్టెంబర్‌లో పాక్ ఓపెనింగ్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ ఈ అవార్డును గెలుచుకోగా, బట్లర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా సెలెక్ట్ కావడం ఇదే మొదటిసారి. టీ 20 వరల్డ్ కప్‌లో అద్భుతంగా ఆడడమే కాకుండా ఇంగ్లండ్ ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో బట్లర్ కీలక పాత్ర పోషించాడు. అంతే కాదు నవంబర్ నెలలో అతను నాలుగు టీ 20 మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో సిద్రా అమీన్27 రన్స్ చేసింది. దాంతో పాక్ వన్డే సిరీస్ గెలవడంలో అమీన్ కీలక పాత్ర పోషించింది.
నవంబర్ నెలకు గానూ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం జోస్ బట్లర్ , ఆదిల్ రషీద్, పాకిస్థాన్ పేసర్ షాహిన్ అప్రిది నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో ఈ అవార్డు కోసం సిద్రా అమీన్, ఐర్లాండ్‌కు చెందిన గాబీ లెవిస్, నెదర్లాండ్స్ ప్లేయర్ నాథకన్ చంథమ్ పోటీ పడ్డారు. అవార్డును ఎక్కువ ఓట్లు వచ్చిన ఆటగాళ్లకు ఇస్తారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ సభ్యులు, మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు, ఐసీసీ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన అభిమానులు ఈ ఓటింగ్‌లో పాల్గొంటారు.