Monday, November 25, 2024

Big Story | కాసులు కురిపిస్తున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా.. రిజిస్ట్రేషన్ల ద్వారా దండిగా ఆదాయం

ఉమ్మడి రంగారెడ్డి, ప్రభన్యూస్‌ బ్యూరో: రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో సగానికి పైగానే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి సమకూరుతోంది. ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్లు పెరుగుతుండటంతో ఆదాయం కూడా పెరుగుతోంది. కేవలం తొమ్మిది మాసాల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లాలో 6,421.24కోట్ల మేర ఆదాయం సమకూరింది. జనవరి నుండి డిసెంబర్‌ వరకు రికార్డు స్థాయిలో ఆదాయం సమకూర్చుకున్నారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలు, ల్యాండ్‌ వ్యాల్యూ పెంచడంతో ఆశించినమేర ఆదాయం పెరుగుతోంది. దండిగా ఆదాయం సమకూర్చిపెడుతున్నా సొంత భవనాలు మచ్చుకైనా కనిపించడం లేదు. అరకొర సౌకర్యాలతో అద్దె భవనాల్లో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిసంవత్సరం ఆదాయం పెంచుకుంటున్నా సొంత భవనాలు నిర్మించాలనే ఆలోచన ప్రభుత్వానికి కలగడం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 34 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నా ఏ ఒక్క దానికి కూడా సొంత భవనాలు లేవు. సొంత భవనాల కోసం జాగాలు కేటాయించి సంవత్సరాలు గడుస్తున్నా అడుగు ముందుకు పడటం లేదు.

హైదరాబాద్‌ మహానగరానికి చుట్టూరా విస్తరించి ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రియల్‌ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. రియల్‌ వ్యాపారం ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం ఒక్కసారిగా ల్యాండ్‌ వ్యాల్యూ పెంచింది. దాంతోపాటు రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా పెంచారు. మొదటి నుండి ఉమ్మడి జిల్లాలో విల్లాలు, అపార్టుమెంట్లు, ప్లాట్ల కొనుగోళ్లు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ల్యాండ్‌ వ్యాల్యూతోపాటు రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఒక్కసారిగా పెంచింది. కొన్ని శివారు ప్రాంతాల్లో 150 శాతం మేర ల్యాండ్‌ వ్యాల్యూ పెంచారు. గత జనవరి మాసం నుండి డిసెంబర్‌ నెలాఖరు వరకు ఉమ్మడి జిల్లాలో క్రయావిక్రయాల ద్వారా ఏకంగా రూ. 6,421.24కోట్ల మేర ఆదాయం సమకూరింది.

- Advertisement -

ఇందులో రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూర్చుకున్నారు. ఇక్కడ ఏకంగా రూ. 3,999.45కోట్లమేర ఆదాయం వచ్చింది. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో 2,421.79కోట్లమేర ఆదాయం వచ్చింది. కేవలం తొమ్మిది మాసాల వ్యవధిలో ఏకంగా అంతమేర ఆదాయం సమకూర్చుకోవడం రికార్డుగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండే సగానికి పైగా ఆదాయం సమకూరుతోంది. ఇందులో రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 34 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. ఇందులో తొమ్మిది మాసాల్లో 4,25,204 డాక్యుమెంట్లు నమోదయ్యాయి. స్టాంప్‌ డ్యూటీ ద్వారా రూ.4,828.43కోట్ల మేర ఆదాయం వచ్చింది. ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ ద్వారా 982.44కోట్ల ఆదాయం రాగా, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 610.35కోట్ల మేర ఆదాయం సమకూరింది. వీటన్నింట్లో రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ ఆదాయం సమకూరుతోంది.

సొంత భవనాలు వట్టిమాటే..

రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో సగానికి పైగా సమకూర్చిపెడుతున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖకు సొంత భవనాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నా సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన కలగడం లేదు. మొదటినుండి ప్రభుత్వ ఖాజానాకు ఉమ్మడి జిల్లానే ఎక్కువ ఆదాయం సమకూర్చుతోంది. ఉమ్మడి జిల్లాలో 34 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాలో 22 కార్యాలయాలుండగా, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో 12 కార్యాలయాలున్నాయి. వీటిలో ఏ ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు. అన్ని ప్రాంతాల్లో సొంత భవనాలు నిర్మించాలని జాగాలు కూడా కేటాయించారు.

రెండువేల గజాల చొప్పున భూమిని కూడా కేటాయించినా నేటికీ భవన నిర్మాణాలు చేపట్టడం లేదు. ప్రతి నెల లక్షలాది రూపాయల అద్దె చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయినా సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. జిల్లా కార్యాలయాలతోపాటు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అన్నీ కూడా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెద్దగా ఉన్నాయి. సగానికి పైగా ప్రాంతాల్లో అరకొర సౌకర్యాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. దండిగా ఆదాయం సమకూర్చిపెడుతున్న ప్రతిసారీ ప్రశంసలు కురిపించడం… హామీలు కురిపించడం పరిపాటిగా మారింది. సొంత భవనాలు నిర్మించాలని ప్రతిసారీ యూనియన్ల ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఉన్నతాధికారులు స్పష్టమైన హామీలు ఇవ్వడంతోనే సరిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement