Tuesday, November 26, 2024

బీజేపీలోకి మర్రి?, ఢిల్లీలో కమలనాథులతో మంతనాలు.. పార్టీ మారడం లేదన్న శశిధర్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కమలదళంలోకి కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వెళ్తున్నారనే వార్త రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. గత కొంతకాలంగా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతల్లో మర్రి ఒకరు. సరిగ్గా ఇదే సమయంలో కొందరు బీజేపీ నేతలతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. దీంతో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారంటూ రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ మొదలైంది. బుధ, గురువారాల్లో వీలు చూసుకుని పార్టీ తీర్థం పుచ్చుకుంటారని కూడా కథనాలు వెలువడ్డాయి.

అయితే ఈ వార్తలను ఖండిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ప్రయాణించిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారని, అంత మాత్రాన పార్టీ మారుతున్నట్టుగా భావించడం సరికాదని పేర్కొన్నారు. తన మనవడు చదువుకుంటున్న పాఠశాలలో ఓ వేడుకకు హాజరయ్యేందుకే ఢిల్లీకి వచ్చానని తెలిపారు. చివర్లో తాను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నానని, రిటైర్ అవలేదని ట్విస్ట్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మర్రి శశిధర్ రెడ్డి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధపడ్డారని తెలిసింది. ఆ దిశగా గత కొన్నాళ్లుగా మంతనాలు సాగుతున్నాయని తెలిసింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం తెలంగాణలో బలమైన నేతల కోసం ఎదురుచూస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ వ్యతిరేకత మాత్రమే బీజేపీని గెలిపించలేదని, ప్రజల్లో పట్టున్న బలమైన నేతలు కూడా జతకలిస్తేనే గెలుపొందవచ్చని లెక్కలు వేస్తోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా చేరికల కోసమే ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈటలతో పాటు పార్టీలో చేరికలను ప్రోత్సహించేందుకు బీజేపీ సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు.

- Advertisement -

ఈ క్రమంలో మర్రి శశిధర్ రెడ్డి చేరిక వ్యవహారాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పర్యవేక్షిస్తున్నట్టు తెలిసింది. పార్టీ సంస్థాగత కార్యక్రమాల కోసం రెండ్రోజుల క్రితమే ఢిల్లీ చేరుకున్న ఆమె, గత కొంతకాలంగా మర్రి శశిధర్ రెడ్డి సహా మరికొందరు అసంతృప్త కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అయితే సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ తప్ప మరో పార్టీ ధ్యాసేలేని మర్రి శశిధర్ రెడ్డి, ఆ పార్టీని వీడే విషయంలో కొంత మానసిక సంఘర్షణకు గురవుతున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రతిరోజూ అవమానాలకు గురవడం కంటే బీజేపీలో చేరితేనే గౌరవప్రదంగా ఉంటుందని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తంగా కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీని వీడడం ఖాయంగా కనిపిస్తోంది.

ఢిల్లీలోనే ఈటల.. పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ఖండన
మరోవైపు బీజేపీ చేరికల కమిటీకి సారథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి మంగళవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. ఆయన బుధవారం కూడా ఢిల్లీలోనే ఉండి పార్టీలో కొందరు ముఖ్యులతో సమావేశమైనట్టు సమాచారం. ఈటల రాజేందర్‌ను తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఆహ్వానిస్తున్నారని, ఆయన తిరిగివెళ్లేందుకు సిద్ధపడుతున్నారని కథనాలు వచ్చిన సమయంలో ఢిల్లీ పెద్దలతో మంతనాలు సాగించడం మరిన్ని ఊహాగానాలకు ఆస్కారం కల్పిస్తోంది.

అయితే ఈటల మాత్రం పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ చేయనప్పటికీ.. ఫోన్ ద్వారా ఆయన మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు. టీఆర్ఎస్‌పార్టీ కష్ట,నష్టాల్లో ఉన్నప్పుడు కూడా వీడకుండా నిబద్ధత చాటుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 2009లో కేవలం 10 మంది మాత్రమే గెలిచిన సందర్భంలో కూడా పార్టీని వీడలేదని, అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌తో విబేధించిన తర్వాత అవమానాలు ఎదుర్కొన్నానని, బలవంతంగా బయటకు గెంటేస్తేనే ఆ పార్టీని వీడానని తెలిపారు. అలాంటి చోటకు ఎలా వెళ్తానని ఎదురు ప్రశ్నించారు. తనకు టీఆర్ఎస్‌ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని, వచ్చినా వెళ్లే ఉద్దేశం లేనేలేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement