Friday, November 22, 2024

జోష్‌ నింపిన జోడో యాత్ర.. దారి పొడుగునా జన నీరాజనం

కాంగ్రెస్‌ పార్టీ సినియర్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు హైదరాబాద్‌లో అపూర్వ స్పందన కనిపించింది. ఆరాంఘర్‌ నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు దాదాపు 20 కిలోమీటర్ల వరకు సాగిన యాత్రలో రాహుల్‌తో కలిసి కాగ్రెస్‌ శ్రేణులు కదం తొక్కాయి. చేతిలో చేయి వేస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ సాగిన జోడో యాత్రకు దారి పొడుగునా నగర ప్రజలు యువ నేతకు నీరాజనం పట్టారు. రాత్రి 7 గంటలకు నెక్లెస్‌ రోడ్‌లో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో కలిసి పాల్గొన్నారు. అనంతరం బోయిన పల్లిలోని గాంధీ ఐడియాలజి సెంటర్‌లో రాత్రి బస చేశారు.

  • ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి:

కాంగ్రెస్‌ యువనేత రాహూల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రకు భాగ్యనగరం జన నీరాజనం పట్టింది. దారి పొడుగునా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రాహుల్‌తో కలిసి కదం తొక్కారు. యాత్ర సాగే దారి పొడుగునా జెండాలు, ప్లెక్సీలు, భారీ కటౌట్లు ఏర్పాట్లు చేసారు. చేతిలో చేయి వేస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ సాగిన జోడో యాత్రకు దారి పొడుగునా నగర ప్రజలు నీరాజనం పట్టారు. ఉదయం శంషాబాద్‌ నుంచి ప్రారంభమైన యాత్ర ఆరాంఘర్‌ మీదుగా సాయంత్రం 4.30 గంటలకు చార్మినార్‌ చేరుకుంది. ప్రసిద్ద పర్యాటక క్షేత్రమైన చార్మినార్‌ను సందర్శించిన అనంతర అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. బహదూర్‌ పురా నుంచి చార్మినార్‌ వరకు సాగిన యాత్రలో పలువురు కరాటే క్రీడాకారులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

అనంతరం అఫ్జల్‌ గంజ్‌, మొజాంజాహి మార్కెట్‌, గాంధీభవన్‌, అసెంబ్‌ఈ రవీంద్రబారతి, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, మీదుగా రాత్రి 7 గంటలకు నెక్లెస్‌ రోడ్‌ చేరుకుంది. అక్కడి ఇందిరా గాంధీ విగ్రహం వద్ద పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలతో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో కలిసి పాల్గొన్నారు. అనంతరం బోయిన పల్లిలోని గాంధీ ఐడియాలజి సెంటర్‌లో రాత్రి బస చేశారు. రెండవ రోజు బుధవారం ఉదయం 6 గంటలకు తిరిగి యాత్రను మొదలు పెట్టనున్నారు. బోయినపల్లి, బాలానగర్‌, మూసాపేట, కూకట్‌ పల్లి, మియాపూర్‌, బీహెచ్‌సీఎల్‌ నుంచి పటాన్‌ చెరువు వరకు ఈ యాత్ర సాగనుంది.

భద్రత మరింత పెంపు

రాహూల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఎలాంటి అపశ్రుతులు తలెత్త కుండ పోలీసులు భారీ భద్రతను పోలీసులు మరింత పెంచారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా పాలమాకులలో గుర్తు తెలియని వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని రాహుల్‌ వద్దకు చేరడం వివాదాస్పదం కావడంతో పోలీసులు మరింత పటిష్ట చర్యలు చేపట్టారు. సంఘటనపై సంబంధిత అధికారులతో సమావేశమైన డీజీపీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సోమవార ం వరకు 600 మందితో ఉన్న భద్రతను 1000కి పెంచారు. పాదయాత్ర జరిగే ప్రాంతంలో కిలో మీటర్‌ వరకు ఎలాంటి వాహనాాలు అడ్డు లేకుండా చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement