Friday, November 22, 2024

ఉద్యోగాలు, పెన్షన్లు, రుణమాఫీ.. గుజరాత్‌ ఓటర్లకు కాంగ్రెస్‌ హామీలు

గుజరాత్‌ అసెంబ్లి ఎన్నికలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదలైంది. ఆ పార్టీ అగ్రనేతలు శనివారం పార్టీ ప్రమాణ పత్రాన్ని విడుదల చేశారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, గుజరాత్‌ పీసీసీ చీఫ్‌ జగదీష్‌ ఠాకూర్‌ జన్‌ ఘోష్ణ పాత్ర 2022-27పేరుతో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. యువత, మహిళలు, ఉద్యోగులు, రైతులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం పాత పెన్షన్‌ అమలును కూడా ప్రకటించింది. రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని భరోసా ఇచ్చింది.

ప్రతి పంటకు కనీస మద్దతు ధర నిర్ణయానికి కమిటీ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. అదే విధంగా వైద్యం, విద్యారంగాల ప్రైవేటీకరణకు బ్రేకులు వేయడమే కాకుండా, మోతెరాలోని నరేంద్ర మోడీ స్టేడియంకు తిరిగి సర్దార్‌ పుటేల్‌ పేరును పునరుద్ధరిస్తామని పేర్కొంది. 2015లో పాటిదార్‌ ఆందోళన సందర్భంగా జరిగిన మరణాలు, ధామన్‌ వెంటిలేటర్ల కుంభకోణం, కొవిడ్‌ వేళ ఆక్సిజన్‌ సిలిండర్ల బ్లాక్‌ మార్కెటింగ్‌, పరీక్ష పత్రాల లీకేజీలపై సమీక్షిస్తామని హామీ ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లను నిషేధించడానికి, అటువంటి ఎమ్మెల్యేలపై విచారణ జరపడానికి కఠినమైన చట్టం తీసుకొస్తామని, డ్రగ్స్‌ నిర్మూలనకు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ సెల్‌ను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.

మేనిఫెస్టో రూపకల్పనకు ముందు ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించామని పార్టీ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ చెప్పారు. రాహుల్‌ గాంధీ సూచన మేరకు మేనిఫెస్టో అమలుకు ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తామని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అన్ని హామీలు నెరవేరుస్తామని గెహ్లాట్‌ చెప్పారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దీపక్‌ బబారియా మాట్లాడుతూ, దాదాపు 65 లక్షల మంది అభిప్రాయాలతో మేనిఫెస్టో సిద్ధం చేశామన్నారు. 182 మంది సభ్యులున్న గుజరాత్‌ శాసనసభకు రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్‌1, 5 తేదీల్లో పోలింగ్‌, 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

కీలకాంశాలు..

  • పాత పెన్షన్‌ పథకం అమలు
  • ప్రభుత్వ రంగ విభాగాల్లో 10 లక్షల ఉద్యోగాలు
  • రూ.500 కే ఎల్‌పీజీ సిలిండర్‌
  • ప్రతినెలా 300యూనిట్లు గృహ విద్యుత్‌ ఉచితం
  • దివ్యాంగులు, మహిళలు, వృద్ధులకు రూ.2000 పెన్షన్‌
  • నిరుద్యోగ భృతి నెలకు రూ.3000
  • మత్స్యకారులకు రూ.3లక్షల వరకు రుణమాఫీ
Advertisement

తాజా వార్తలు

Advertisement