అన్యాయంతో కూడిన పీఆర్సీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్‌ను ఉద్యోగ, ఉపాధ్యాయులు ముట్టడించారు. జగన్ ప్రభుత్వం ప్రకటించిన అసంబద్ధ పీఆర్సీ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ కదంతొక్కారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇకనైనా ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్‌లో ఉద్యోగులందరూ సమ్మెకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఫ్యాప్టో నేతలు హెచ్చరించారు. కర్నూలు కలెక్టరేట్ ముట్టడికి జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు తరలివచ్చారు.
వీరి ఆందోళనలకు సచివాలయ ఉద్యోగులు, ఇది రాజకీయ, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమని మండిపడ్డారు. పీఆర్సి విషయంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఉద్యోగులంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల పిలుపుతో భారీగా తరలివచ్చిన ఉద్యోగులతో కలెక్టరేట్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఈ క్రమంలో భారీ బందోబస్తుతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..