హైదరాబాద్, ఆంధ్రప్రభ: విద్యార్థులకు ఉపాధియే లక్ష్యంగా రాబోయే నూతన విద్యా సంవత్సరం 2023-24 నుంచి తెలంగాణ ఉన్నత విద్యామండలి సెక్టార్ స్కిల్ కోర్సులను (నైపుణ్య శిక్షణ కోర్సులు) అందుబాటులోకి తేనుంది. డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు తమ చదువులు ముగించుకుని బయటకు రాగానే, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా స్కిల్ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్స్ కోర్సులను అందించేలా శ్రీకారం చుడుతోంది. ప్రతి విద్యార్థి తప్పకుండా ఇంటర్న్షిప్ పూర్తి చేసేలా కోర్సులను రూపొందిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో చేరేవారికి ఇది వర్తిస్తుంది. డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏలో ఇంటర్న్షిప్ను అందుబాటులోకి తెస్తున్నారు.
బీబీఏ రిటైలింగ్, ఈ కామర్స్ ఆపరేషన్స్, లాజిస్టిక్స్, బీఏ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటర్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ తదితర మొత్తం పది రకాల కోర్సులను అందించేలా రూపొందించారు. పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, హాస్పిటల్స్, వాణిజ్యసంస్థలతో కాలేజీలను అనుసంధానం చేసి మార్కెట్కు అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానం విద్యార్థులకు అందేలా శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో మొత్తం 1054 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. అయితే వీటిలో మొదటి దఫాలో భాగంగా 103 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఈ నూతన కోర్సులను ప్రవేశ పెడుతున్నారు.
ఇందులో 37 ప్రభుత్వ, 66 ప్రైవేట్ కాలేజీలను ఆయా యూనివర్సిటీల పరిధిలో ఎంపిక చేశారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి, మౌలిక వసతులు, పేరున్న కాలేజీలను ఈ కోర్సుల కోసం అధికారులు గుర్తించారు. వారానికి 3 రోజులు తరగతులు…3 రోజులు ఆయా పరిశ్రమల్లో నైపుణ్య శిక్షణను అందిస్తారు. ఈ నైపుణ్య శిక్షణను కేంద్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్దేశించిన పరిశ్రమల్లో విద్యార్థులు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. ఏ సంస్థలోనైతే విద్యార్థులు ఇంటర్న్షిప్ చేస్తారో ఆయా సంస్థలే విద్యార్థులకు నెలకు రూ.10 వేలు ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెెలంగాణ యూనవర్సిటీ, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 103 కాలేజీలను ఈ నూతన కోర్సులకు ఎంపిక చేశారు. అయితే ఒక్కో కాలేజీలో ఒక కోర్సుకు 60 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఓయూ పరిధిలో మొత్తం 56 కాలేజీలను ఎంపిక చేయగా అందులో ప్రభుత్వ కాలేజీలు 17, ప్రైవేట్ కాలేజీలు 39 ఉన్నాయి. కాకతీయ పరిధిలో ఏడు ప్రభుత్వ, 13 ప్రైవేట్ కాలేజీలు, మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో 2 ప్రభుత్వ, 3 ప్రైవేట్, పాలమూరు పరిధిలో 5 ప్రభుత్వ కాలేజీలున్నాయి. తెలంగాణ వర్సిటీ పరిధిలో 3 ప్రభుత్వ, 5 ప్రైవేట్, శాతవాహన పరిధిలో 2 ప్రభుత్వ, 6 ప్రైవేట్ కాలేజీలు ఉండగా, మహిళా విశ్వవిద్యాలయం పరిధిలో ఒకటి ప్రభుత్వ కాలేజీల్లో ఈ ఇంటర్న్షిప్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. దోస్త్ ద్వారానే విద్యార్థులు ఈ కోర్సులకు అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది. త్వరలోనే ఉన్నత విద్యామండలి ఈ కోర్సులను ప్రకటించనుంది.
భవిష్యత్తులో మరిన్ని కాలేజీల్లో ప్రవేశపెడతాం: ప్రొ.ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ మొదటి దఫాలో 103 కాలేజీల్లో ప్రవేశపెడుతున్నామని, రానున్న రోజుల్లో కాలేజీల సంఖ్యను పెంచి విద్యార్థులకు నైపుణ్య శిక్షణను అందించేలా చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.ఆర్ లింబాద్రి చెప్పారు. ఈ కోర్సులను చేయడం ద్వారా విద్యార్థులు చదువుతోపాటే నైపుణ్య శిక్షణను పొందటం ద్వారా చదువు పూర్తయి బయటికి వచ్చేసరికి మంచి ఉపాధి పొందే వీలుంటుంది. విద్యార్థులకు ఇచ్చే నెలకు రూ.10వేలు వేతనమనేది వారికి ఇతర అనుబంధ కంప్యూటర్, ఇతర కోర్సులు చేసుకోవడానికి, తమ అవసరాలకు ఉపయోగపడతాయి. త్వరలో తీసుకొస్తున్న ఈ కోర్సులను ఎంచుకొని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.