ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ షేర్‌చాట్ 20 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ప్రస్త్తుతం షేర్‌చాట్‌లో 2,100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అంటే సంస్ధ దాదాపు 600 మందిని తొలగించాలని నిర్ణయింది. ఖర్చులు తగ్గించుకోవాలని, ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని షేర్‌చాట్ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. షేర్‌చాట్‌లో ప్రధానంగా గూగుల్, టెమాసెక్ సంస్థల పెట్టుబడులు అధిక శాతం కలిగి ఉన్నాయి. ప్రపంచ ఆర్ధిక మాంద్యం రానుందని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్న సమయంలో ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించామని షేర్‌చాట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంకుష్ సచ్‌దేవా తెలిపారు. బెంగళూర్ కేంద్రంగా పని చేస్తున్న షేర్‌చాట్ విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉంది. మన దేశంతో పాటు, అమెరికా, యూరప్‌లో షేర్‌చాట్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
తొలగింపు విషయాన్ని కంపెనీ ఉద్యోగులకు ఇ-మెయిల్ ద్వారా తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు 2022 డిసెంబర్ వరకు వంద శాతం వేరియబుల్ పేని చెల్లించనున్నట్లు తెలిపింది. నోటీస్ పీరియడ్ ఉన్న కాలానికి పూర్తి వేతనం చెల్లిస్తామని ప్రకటించింది. పని చేసిన కాలానికి ఏడాదికి రెండు వారాల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని హామి ఇచ్చింది. 2023 జూన్ వరకు ఆరోగ్య బీమా సదుపాయం కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. వాడుకోని సెలవులకు గరిష్టంగా 45 రోజుల వరకు ఎన్‌క్యాష్ చేసుకోవచ్చని తెలిపింది.
ఐఐటీ పూర్వ విద్యార్ధులైన సత్యదేవ, ఫరీద్ అషన్, భాను సింగ్ కలిసి 2015లో షేర్‌చాట్ యాప్‌ను ప్రారంభించారు. ప్రాంతీయ భాషలో కంటెంట్‌ను అందించడంతో తక్కువ కాలంలోనేఈ యాప్ ఆదరణ పొందింది. టిక్‌టాక్‌ను మన దేశంలో నిషేధించిన తరువాత ఇదే కంపెనీ మోజ్ పేరతో వీడియో షేరింగ్ యాప్‌ను కూడా తీసుకు వచ్చింది. వీడియో షేరింగ్, సోషల్ మీడియా ఆధరణ పెరుగుతున్నందున షేర్‌చాట్ మాతృ సంస్థ మొహల్లా టెక్‌లో పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఇదే సంస్థ డిసెంబర్ నెలలో తన జీత్ 11 ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ను మూసివేసింది. అందులో పని చేస్తున్న 115 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఇప్పుడు నెల రోజుల్లోనే షేర్‌చాట్‌లో 20 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.