Friday, November 22, 2024

ఉద్యోగం ఇప్పిస్తామ‌ని రూ.11ల‌క్ష‌ల‌కి టోక‌రా – న‌లుగురి అరెస్ట్

ఉద్యోగం ఇప్పిస్తామ‌ని మాయ‌మాట‌లు చెప్పి రూ.ప‌దిల‌క్ష‌ల‌కి టోక‌రా పెట్టాడో వ్య‌క్తి. స‌చివాల‌యంలో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ ఉద్యోగం ఇప్పిస్తామ‌ని న‌మ్మించి, నెల‌కు రూ.70వేల జీతం వ‌స్తుంద‌ని మాయ మాట‌ల‌తో బురిడీ కొట్టించారు. వీరి మాటలు నమ్మిన నిరుద్యోగ యువకుడు, అతని తండ్రి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో డబ్బులు ఇచ్చారు. విడతల వారీగా రూ.పదకొండున్నర లక్షలు ముట్టజెప్పారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం యర్రగుంట్లపాడుకు చెందిన నరేష్ ఎంబీఏ చదివాడు. కొద్ది రోజుల క్రితం అతని తండ్రికి శ్రీనివాసరావు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. నరేష్ తండ్రి శ్రీనివాసరావు.. తన కుమారుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పాడు. దీనిని అవకాశంగా మలుచుకున్న శ్రీనివాసరావు తన అల్లుడు ఐఏఎస్ అధికారి అని, అతని ద్వారా సచివాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు.

రోజులు గడుస్తున్నా.. ఉద్యోగం రాకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. తనను సంప్రదించిన వారి వద్దకు వెళ్లి ఆరా తీశాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో డబ్బులు, సర్టిఫికెట్లు కావాలని కోరాడు. డబ్బులు అడిగితే చంపేస్తామని వారు బెదిరించారు. దీంతో ఏం చేయాలో తోచక పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టి నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. సచివాలయం, హైకోర్టులో ఉద్యోగాల పేరుతో కొంతమంది మోసం చేస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement