Friday, September 20, 2024

AP | ప్రతి సంవత్సరం జనవరికి జాబ్‌ క్యాలెండర్‌..

చిత్తూరు, ప్రభ న్యూస్‌ బ్యూరో : ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ వెల్లడించారు. బంగారుపాళ్యం మండలం ఎన్‌. కోటూరులో శుక్రవారం ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి లోకేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

ఆ సంవత్సరంలో ఖాళీ అయిన పోస్టులను జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడం ద్వారా పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా డీఎస్సీని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం ఈ విద్యా సంవత్సరం ఆఖరికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి దాదాపు 16 వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డీఎస్సీ పై తొలి సంతకం చేశారని, పోస్టుల భర్తీ బాధ్యత తనదేనన్నారు. వచ్చే విద్యా సంవత్సరం లోపు పోస్టుల భర్తీకి ప్రక్రియ ప్రారంభం అయ్యిందని, అనుకున్న సమయానికి పూర్తి చేస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు.

భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఎన్డిఏ కూటమిపై నమ్మకం ఉంచి 164 అసెంబ్లీ స్థానాలలో గెలిపించారన్నారు. ఎన్డిఏ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పై మరింత బాధ్యతను పెంచిందని, దీనికి అనుగుణంగా పని చేస్తామన్నారు. మిషన్‌ రాయలసీమ ద్వారా రాయలసీమలో విద్యార్థులకు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు, నాణ్యమైన విద్య, చదువుకున్న వారికి మంచి ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని, రైతులకు సబ్సిడీ ద్వారా డ్రిప్‌ ఇరిగేషన్‌ అందించాలని భావించామని, దేశ విదేశాలకు మేలు రకపు మామిడి పండ్లను రాయలసీమ నుండి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాద్‌ రావు, పూతలపట్టు ఎంఎల్‌ఏ కే.మురళి మోహన్‌, జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, జేసీ జీ విద్యాధరి, పలమనేరు, నగరి, చంద్రగిరి, పీలేరు శాసనసభ్యులు ఎన్‌.అమరనాథ్‌ రెడ్డి, భానుప్రకాష్‌, పులివర్తి నాని, నల్లరి కిశోరే కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇది మంచి ప్రభుత్వం అనే లోగోను ఆవిష్కరించారు. ప్రజల సమస్యలకు మంత్రి సమాధానం చెప్పారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement