న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బీసీ బిల్లు సాధనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జేఎన్‌యూ విద్యార్థి నాయకులు వెల్లడించారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు, జనగణనలో కులగణన అంశంపై బీసీ సంఘాల వ్యూహాత్మక రౌండ్ టేబుల్ సమావేశంలో ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. సోమవారం జేఎన్‌యూలోని స్టూడెంట్స్ కమ్యూనిటీ సెంటర్‌లో జేఎన్‌యూ ఓబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు డాక్టర్ ములాయంసింగ్ యాదవ్ అధ్యక్షతన బీసీల వ్యూహాత్మక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్త పోరటాన్ని ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మండల్ కమిషన్ సిఫారసుల అమలు, బీసీ బిల్లు సాధన సత్వరమే అమలు జరగాలని ఆకాంక్షించారు.
బీసీ బిల్లు సాధన ఆవశ్యకత , దేశంలోని బీసీ ల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, బీసీల సర్వతోముఖాభివృద్ధి, పబ్లిక్ సెక్టార్‌లో ఉన్న బీసీ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ బీసీ ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు, కార్మికులు, మహిళా సంఘాలను మమేకం చేస్తూ, దేశంలో బీసీల పోరాటాన్ని ముమ్మరం చేయడానికి జేఎన్‌యూ నాయకులంతా తమ మద్దతు తెలిపారన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీసీ ఉద్యమాన్ని ఉదృతం చేయడానికి శాసనసభ, పార్లమెంట్ బీసీ ప్రతినిధులను మమేకం చేసి ప్రభుత్వాలపై ఒత్తిడిని తీవ్ర తరం చేసి, బీసీల హక్కులను సాధించే వరకు విశ్రమించేది లేదని దాసు సురేష్ తేల్చిచెప్పారు. పార్లమెంట్ ప్రతినిధులతో, వివిధ పార్టీల బీసీ సీనియర్ నాయకులతో ఢిల్లీ కేంద్రంగా త్వరలోనే ఒక అంతర్గత సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎల్‌బీఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అలోక్ కుశ్వా, ఎఐఓబీసీ ముఖ్య నాయకుడు పుష్పరాజ్, జేఎన్‌యూ నాయకులు సతీష్ చంద్ర యాదవ్, విజయ్ పాల్‌లతో పాటు, తెలంగాణా రాష్ట్రం నుంచి పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.