హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మరో రెండు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలు రానున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒకటి, ఖమ్మం జిల్లా పాలేరులో మరోక కళాశాల ఏర్పాటు కానుంది. కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. బీటెక్‌లో ఐదు కోర్సులతో జేఎన్టీయూ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, డేటా సైన్స్, మెకానికల్ కోర్సులతో కొత్త కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి.
ఒక్కో కోర్సులో 60 సీట్ల చొప్పున సీట్లను కేటాయించారు. ఈ కొత్త కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలను కల్పించనున్నారు. కొత్తగా జేఎన్టీయూ కళాశాలలు ఆయా జిల్లాలకు మంజూరు కావడంతో పాలేరు, మహబూబాబాద్ అధికార పార్టీ నేతలు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో ఉండే గ్రామీణ విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుల కోసం ఇకపై హైదరాబాద్ నగరానికి రానక్కర్లేదు. తమ ప్రాంతాల్లోనే కొత్త కాలేజీలను ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంత యువతకు ఇకనుంచి ఎంతో ప్రయోజనం చేకూరనుంది.