Saturday, November 23, 2024

జియో శాటిలైట్‌.. సరికొత్త వ్యాపారంలో రిల్‌

దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్‌ అంబానీ సారథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌.. మరో కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది. రిలయన్స్‌ జియో సేవలను మరింత విస్తరించుకోవడంలో భాగంగా ఓ విదేశీ కంపెనీతో భాగస్వామ్యం కానుంది. ఈ రెండు కంపెనీలు కలిసి సంయుక్త వెంచర్‌గా ఏర్పడనున్నాయి. ప్రత్యేకంగా ఓ కార్పొరేట్‌ కంపెనీనే నెలకొల్పనున్నాయి. 51 శాతం, 49 శాతం వాటాలతో ఈ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఆవిర్భవించనుంది. లగ్జెంబర్గ్‌కు చెందిన శాటిలైట్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ కంపెనీ ఎస్‌ఈఎస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నామని రిలయన్స్‌ జియో వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు మరింత విస్తరించుకోవడంలో భాగంగా ఎస్‌ఈఎస్‌ కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు తెలిపింది. ఉపగ్రహ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించే దిశగా ముందడుగు వేశామని పేర్కొంది.

రిల్‌తో ఒప్పందం సంతోషకరం..

జియో స్టేషనరీ, మీడియం ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్‌ కన్‌స్టెల్లేషన్స్‌, జియో స్పేస్‌ టెక్నాలజీ ఆధారంగా ఈ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్‌ పేర్కొంది. మల్టి గిగా బైట్‌ లింక్స్‌, మొబైల్‌ బ్యాక్‌ హాల్‌, రిటైల్‌ కస్టమర్ల వరకు ఈ సేవలను తీసుకెళ్తామని తెలిపింది. జాయింట్‌ వెంచర్‌గా ఏర్పాటు చేయబోయే కంపెనీలో 51:49 శాతం ప్రాతిపదికన ఎస్‌ఈఎస్‌, జియోల వాటాలు ఉంటాయని వివరించింది. జియో స్పేస్‌ టెక్నాలజీని ఎస్‌ఈఎస్‌ కంపెనీ ప్రొవైడ్‌ చేస్తుందని, దీనికి అవసరమైన ప్లాట్ఫామ్స్‌ను తాము సమకూరుస్తామని పేర్కొంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఉప గ్రహ ఆధారిత బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను అదించడానికి అవసరమైన ఏర్పాట్లను తరలోనే చేపడ్తామని, భారతీయ మార్కెట్‌లో అడుగు పెట్టబోతుండటం సంతోషాన్ని ఇస్తోందని ఎస్‌ఈఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ స్టీవ్‌ కాలర్‌ తెలిపారు. హైకాలిటీ కనెక్టివిటీతో తమ సేవలను యూజర్లకు అందిస్తామన్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. తమ సంస్థ వివిధ కక్ష్యల్లోని ఉప గ్రహాల నెట్‌వర్క్‌ను వాడుకుంటుంది. ఫలితంగా 100 జీబీపీఎస్‌ సామర్థ్యంతో ఇంటర్నెట్‌ అందించొచ్చు. ఈ డీల్‌లో భాగంగా జియో గేట్‌ వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తోందని తెలిపారు.

మెరుగైన సేవలందిస్తాం..

జియో కంపెనీ డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ మాట్లాడుతూ.. జియో స్పేస్‌ టెక్నాలజీస్‌ పేరిట ఓ జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో జియోకు 51 శాతం వాటా, ఎస్‌ఈఎస్‌కు 49శాతం వాటా ఉంటుందన్నారు. తమ ఫైబర్‌ నెట్‌వర్క్‌ విస్తరణ, ఫైబర్‌ టు ది హోం వ్యాపారం, 5జీ రంగంలో పెట్టుబడులు కొనసాగిస్తామని వివరించారు. మల్టిd గిగా బైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ వ్యాపార వృద్ధి కోసం ఎస్‌ఈఎస్‌తో జాయింట్‌ వెంచర్‌ ప్రారంభించామన్నారు. ఈ విషయంలో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌తో అదనపు కవరేజీ, సామర్థ్యం లభిస్తుందని వివరించారు. దీంతో జియో మారుమూల గ్రామాల్లో సైతం సేవలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మారుమూల పట్టణాలు, గ్రామాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలను, వినియోగదారులకు తమ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆకాశ్‌ అంబానీ స్పష్టం చేశారు. డిజిటల్‌ ఇండియాలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని వివరించారు. శాటిలైట్‌ పరిశ్రమలో నిపుణులైన ఎస్‌ఈఎస్‌తో కలిసి సరికొత్త ప్రయాణం ప్రారంభించి.. యూజర్లకు మరింత చేరువ అవుతామని తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement